పెద్దకాపర్తిలో వర్షాల కోసం కప్పకాముడు ఆచారం
వరుణదేవునికి మహిళల ప్రత్యేక ప్రార్థనలు
చిట్యాల, జూలై 16: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ గురువారం గ్రామ మహిళలు తెలంగాణ సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే కప్పకాముడు ఆచారాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు గ్రామ వీధుల్లో కప్పకాముడు ఆటలు ఆడుతూ, సంప్రదాయ జానపద గీతాలు ఆలపించి, వరుణదేవుని ప్రార్థించారు. అనంతరం కప్పలకు నీళ్లు పోసి, గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేకంగా వేడుకున్నారు. గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ, తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతున్న కప్పకాముడు ఆచారం ప్రకృతితో మమేకమైన సంస్కృతికి ప్రతీక అని, ఇటువంటి సంప్రదాయాలను యువత కూడా పరిరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం, వార్డు సభ్యుడు ఆనకటి నరేష్, గ్రామ నాయకులు ఏర్పుల వెంకన్న, కూరు యాదయ్య, నీలకంఠం, లింగస్వామి తదితరులు పాల్గొని కప్పలకు నీళ్లు పోసి, వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.






