మార్గం రాజేశ్‌కు సినారె పురస్కారం
ఎల్బీనగర్, జులై 29: ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ కు ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక యువ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో డా. సి.నారాయణ రెడ్డి 95వ జయంతి వేడుకలు చిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో బుధవారం జరిగాయి.
ఈ ఉత్సవాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిoచిన ప్రముఖులను హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించి, డాక్టర్ సినారె సేవారత్న అవార్డులు అందజేశారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహం అధ్యక్షులు మార్గం రాజేశ్ ‘ డా.సినారే సేవారత్న‘ పురస్కారం అందుకున్నారు.
ఈ సందర్భంగా యువ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షుడు డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ... అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనాథ పిల్లలకు అందిస్తున్న సేవలు అమోఘమని, నిస్వార్థంగా, స్వచ్ఛందంగా చేస్తున్నoదుకు ‘డాక్టర్ సినారె సేవారత్న‘ పురస్కారానికి ఎంపిక చేశామని ప్రకటించారు. అనేక మంది అనాథ విద్యార్థులకు ఆశ్రయం, విద్య అందిస్తున్న విద్యార్థి గృహానికి ప్రతిష్టాత్మకంగా అవార్డు రావడం ఆనందంగా ఉందని గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి డాక్టర్ వేణుగోపాలచారి, తెలంగాణ భాషా, సంస్కృత శాఖ డైరెక్టర్ డాక్టర్ నర్సింహారెడ్డి తదితరులకు హాజరయ్యారు.






