30 July, 2026 | 1:35 AM

నెలరోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

30-07-2026 12:41 AM
  1. సమన్వయ కమిటీ సమావేశం 45 రోజులకు ఒకసారి భేటీ
  2. కర్ణాటక సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశాం 
  3. మీడియాతో చిట్ చాట్‌లో పీసీసీ అధ్యక్షుడు  

హైదరాబాద్, జూలై 29(విజయక్రాంతి): పీసీసీ సమన్వయ కమిటీ ఏర్పాటయ్యాక మొదటిసారి సమావేశం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇకనుంచి ప్రతి 45 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ భేటీ జరుగుతుందన్నారు. బుధవారం అయన ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ప్రభుత్వపరంగా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పథకాలు కార్యక్రమాలకు సంబంధించి ముందు సమన్వయ కమిటీలో చర్చించాలని అనుకున్నామన్నారు.

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నెల రోజుల్లోనే అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పారు. నేతల మధ్య ఉన్న గ్యాప్‌లను సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏఐసీసీ పిలుపుమేరకు కార్యక్రమాలు నిర్వహించడంలో దేశంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంపై చర్చ ఏమీ జరగలేదనీ, మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, లాటరీ విధానాన్ని లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. నేను, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగానే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ని కలిసామన్నారు. యాదగిరిగుట్టను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారనీ, ఆదిశగానే పాలకమండలి కమిటీ ఏర్పాటైందని ఆయన వివరించారు.