అక్టోబర్‌కల్లా షూటింగ్ పూర్తి
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రాబోతున్న విజువల్ వండర్ ‘వారణాసి. మహేశ్‌బాబు ఈ చిత్రంలో రుద్రుడు, శ్రీరాముడిగా అలరించనున్నారు. కథానాయకి ‘మందాకిని’గా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, విలన్ ‘రణకుంభ’గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. 2027, ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు గ్లింప్స్ తప్ప ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు.
తండ్రీకొడుకుల భావోదేగాల కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు గతంలో రివీల్ చేశారు రాజమౌళి. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, బీజీఎం వర్క్స్ కూడా ప్రారంభించినట్టు సంగీత దర్శకుడు కీరవాణి ఓ సందర్భంలో తెలిపారు. మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. ఇదిలావుండగా, రాజమౌళి తాజాగా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి మరికొన్ని విశేషాలను పంచుకున్నారు.
వారణాసి కథ ఆధ్యాత్మిక నగరం వారణాసితో మొదలై అంటార్కిటికా, ఆఫ్రికా అడవుల్లో ప్రయాణించి రామాయణ కాలానికి తీసుకెళ్లి, మళ్లీ వారణాసికి తిరిగొస్తుందని చెప్పారు దర్శక ధీరుడు. “నాకు ఇండియానా జోన్స్ కథలంటే చాలా ఇష్టం. నాకు హాలీవుడ్ సినిమాలపై ఆసక్తి ఎక్కువ. చిన్నప్పటి నుంచి వాటినే చూస్తూ నేను పెరిగాను. ఆ ప్రభావం నా సినిమాలపై ఉంటుంది. నా సినిమాలను హాలీవుడ్ చిత్రాలతో పోలుస్తుంటారు. అందుకు నేనెప్పుడూ ఇబ్బంది పడను. ‘వారణాసి’ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తీయడానికి కారణం కథలో ఉన్న భారీదనమే. 300 అడుగులకు పైగా ఉన్న భారీ మంచుకొండ, రామాయణంలోని భారీ వానర సేన.. ఇలా ఎన్నో కీలక సన్నివేశాలు ఇందులో ఉన్నాయి.
వాటిని అద్భుతంగా, విశాలంగా చూపించాలంటే ఐమ్యాక్స్ ఫార్మాట్ సరైనది అనిపించింది. 2022 నుంచి ఈ కథను డెవలప్ చేయడం ప్రారంభించాం. దాదాపు నాలుగున్నరేళ్లు పట్టింది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఇంకా 20 శాతంలో చిన్న చిన్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. యాక్షన్ పార్ట్ మొత్తం ఎప్పుడో పూర్తయిపోయింది. అక్టోబర్‌కల్లా షూటింగ్ అంతా పూర్తవుతుంది. కథ, నేపథ్యం తెలియకుండా ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించలేరు. అందుకే ‘వారణాసి’ గ్లింప్స్‌లో అన్నింటినీ చూపించాం” అని తెలిపారు.






