ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి) : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజావాణి పోర్టల్లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదును నిర్దిష్ట గడువులోగా పరిష్కరించడం సంబంధిత అధికారుల ప్రాథమిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వయంగా స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పెన్షన్లు, ఉపాధి హామీ పథకం, భూభారతి సమస్యలు తదితర అంశాలకు సంబంధించిన మొత్తం 109 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిపై తక్షణ చర్యలు తీసుకుని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును 30 రోజుల్లోపు పరిష్కరించాలని సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో ప్రజావాణి పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఒకే సమస్యపై పదేపదే ఫిర్యాదులు రాకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్రు, డిఆర్‌ఓ స్రవంతి, ఏవో వర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






