4 August, 2026 | 2:31 AM

కింగ్, జాకీ, క్వీన్.. గుర్తుండిపోయే పాత్రలు

04-08-2026 12:43 AM

ఎస్‌ఎల్‌వీ సినిమా బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా ‘కేజేక్యూ’ (కింగ్ జాకీ క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ‘దసరా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు కేకే (కిరణ్)కు ఇది చివరి చిత్రం. ఈ సినిమా ఆగస్టు 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్‌మీట్‌లో హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. “ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ఒక ఎక్సైట్‌మెంట్, ఒక భయం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా బాధగా ఉంది. సినిమా విడుదల సమయంలో దర్శకుడు మన మధ్య లేకపోవడం.. సినిమా తండ్రి లేని కొడుకులా అనిపిస్తోంది. శ్రీకాంత్, నిర్మాత సుధాకర్ మాకు అండగా నిలిచారు. ‘దసరా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాల్లాగే ఈసారి కూడా ప్రేక్షకులను నిరాశ పరచను. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు కింగ్, జాకీ, క్వీన్ పాత్రలు మీకు గుర్తుండిపోతాయి” అన్నారు.

‘రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండే చిత్రమిది’ అని హీరో శశి చెప్పారు. హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ.. “రిలీజ్ సమయంలో కిరణ్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. కానీ ‘కేజేక్యూ’ లాంటి ఒక మాస్టర్ పీస్‌ను మనకు ఇచ్చి వెళ్లారు. ఇందులో నా పాత్రకు చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక నటిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇది” అని తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.