2 September, 2026 | 2:06 AM

ప్రభుత్వాసుపత్రిలో లైంగికదాడి?

02-09-2026 | 12:54am
  1. మీడియా ముందుకొచ్చిన మహిళా సెక్యూరిటీ గార్డు
  2. సురక్ష ఏజెన్సీ సూపర్‌వైజర్‌పై ఆరోపణలు
  3. విచారణ చేపట్టి న్యాయం చేయాలన్న బాధితురాలు
  4. సిద్ధిపేట బీసీ సంఘం నాయకుల భరోసాతో మీడియా ముందుకు

గజ్వేల్, సెప్టెంబర్ 1: ప్రభుత్వ ఆసుపత్రిలోనే తనకు రక్షణ లేకుండా పోయిందంటూ ఓ మహిళా సెక్యూరిటీ గార్డు (Security guard) చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఏడేళ్లుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ మహిళ సురక్ష ఏజెన్సీ సూపర్‌వైజర్ బండి రమేష్ తనను పలుమార్లు లైంగికంగా వేధించడంతో పాటు లైంగికదాడి చేశాడని ఆరోపించారు. ఈ విషయాన్ని బయటకు చెబితే తన కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరించాడని ఆమె మంగళవారం మీడియాతో తన ఆవేదనన వ్యక్తం చేశారు.

తనకు జరిగిన అన్యాయంపై ఎవరిని ఆశ్రయించాలో తెలియక కొంతకాలంగా తీవ్ర ఆవేదనకు గురైనట్లు బాధితురాలు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ అండదండలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించారు. చివరకు సిద్దిపేట జిల్లా బీసీ సంఘం నాయకులను ఆశ్రయించగా, వారు తనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. దీంతో గజ్వేల్ పట్టణంలో మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు తనకు ఎదురైనట్లు చెబుతున్న ఘటనలను వెల్లడించారు.

తనపై జరిగినట్లు ఆరోపిస్తున్న లైంగిక వేధింపులు, లైంగికదాడి ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజనిజాలను నిగ్గుతేల్చాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోపణలపై సదరు సూపర్‌వైజర్ మాట్లాడుతూ.. పోలీసుల దర్యాప్తులో వివరాలు వెల్లడవుతాయని అన్నారు.