2 September, 2026 | 3:03 AM

ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విఫలం

02-09-2026 | 12:57am
  1. కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలి 
  2. 6న ఇందిరాపార్కు వద్ద ధర్నా 
  3. ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు వెల్లడి 

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి) : ప్రజా ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఆందోళన చేసే ముందు.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వ పథకాలపై చర్చించాలని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు (Government Advisor V. Hanumantha Rao) సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా అదనంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోం దని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలను పట్టించుకోని కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు ఈ నెల 6న ఇందిరాపార్కు వద్ద.. కేసీఆర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ధర్నా చేపట్ట నున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు ఈ నిరసన కొనసాగుతుందన్నారు.

ఈ ధర్నాకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు వేలాదిగా తరలిరావాలని వీహెచ్ కోరారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులు, తప్పులను సీఎం రేవంత్‌రెడ్డి సరిదిద్దుతూ ప్రజా పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు కుల గణన చేసి.. రాష్ట్రంలో బీసీల లెక్కలు తీశారని వీహెచ్ పేర్కొన్నారు. బీసీ అని చెప్పుకునే ప్రధాని నరేంద్రమోదీ కుల గణన ఎందుకు చేయడం లేదని వీహెచ్ నిలదీశారు. 

విమర్శలు చేసే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు: లింగంయాదవ్ 

ప్రజా ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్‌కు మాట్లాడే హక్కు లేదని పీసీసీ అధికార ప్రతినిధి లింగంయాదవ్ అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని విమర్శించారు.  సంక్షేమం, అభివృద్ధి పై  చర్చకు రావాలన్నారు.  వెయ్యి రోజుల పాలనతో బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనకు పోలికే లేదని పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పేర్కొన్నారు.