2 September, 2026 | 3:04 AM

7న కేంద్ర సాంకేతిక బృందం రాక

02-09-2026 | 12:49am
  1. కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ స్థల ఎంపిక కోసం పరిశీలన
  2. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  3. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో తుమ్మల భేటీ  

హైదరాబాద్/భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ప్రజల సుదీర్ఘ స్వప్నమైన విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియ(Airport establishment process)లో మరో కీలక అడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కొత్తగా గుర్తించిన 4 నుంచి 5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం(Central Technical Team) ఈ నెల 7న తెలంగాణలో పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి(Kinjarapu Rammohan Naidu)తో మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) సమావేశమైయ్యారు.

అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) మీడియాతో మాట్లాడుతూ గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాల వల్ల విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేవని అధికారులు తేల్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ ప్రదేశాలను గుర్తించినట్లు చెప్పారు. ఈ స్థలాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితులతో పాటు ఎయిర్‌ఫోర్ట్  నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు.

నివేదిక సానుకూలంగా రాగానే కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలోని ఇతర ప్రతిపాదిత విమానాశ్రయాలైన మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల  అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని తుమ్మల ఈ సందర్భంగా తెలిపారు.

ఎర్రన్నాయుడితో మైత్రిని గుర్తుచేసుకున్న తుమ్మల..

ఈ భేటీ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి తండ్రి, దివంగత ఎర్రన్నాయుడితో తనకున్న చిరకాల మైత్రిని తుమ్మల గుర్తు చేసుకున్నారు. తన విజ్ఞప్తికి  స్పందించిన రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.