లక్ష్య సాధనకు స్మార్ట్ వర్క్ ముఖ్యం
కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి):పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కఠోర శ్రమతో పాటు ప్రణాళికాబద్ధమైన ’స్మార్ట్ వర్క్’ (Smart work) ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మెరిట్ అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సు శిక్షణ(Foundation Course Training) తరగతులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సిలబస్పు పూర్తి పట్టు సాధించి, పరిమితమైన ప్రామాణిక పుస్తకాలను మాత్రమే ఎంచుకోవాలని సూచించారు.
స్టాటిక్ అంశాలను సమకాలీన పరిణామాలతో (కరెంట్ అఫైర్స్) అనుసంధానిస్తూ నోట్స్ తయారు చేసుకోవాలని, ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కు ఎంతో దోహదపడుతుందన్నారు. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంలో ’ఎలిమినేషన్ మెథడ్’ కీలకమని, దీనికోసం అధిక సంఖ్యలో మోడల్ పేపర్లు, మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాల వంటి ఆటంకాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదవాలని సూచించారు.
త్వరలో ప్రభుత్వం నుంచి పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో, బీసీ స్టడీ సర్కిల్ అందించే శిక్షణను, అధ్యాపకుల మార్గదర్శకత్వాన్ని అభ్యర్థులు నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. అంతకు ముందు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొంది ఉద్యోగం సాధించిన వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీతకుమారి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, అధ్యాపకులు, ఉద్యోగ విజేతలు, అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.






