భిక్కనూర్‌లో వరుస దొంగతనాలు
మహిళ అరెస్ట్, పరారీలో భర్త
భిక్కనూర్, మార్చి 11: (విజయక్రాంతి): భిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఇంటి దొంగతనం, ఆలయ దొంగతనం కేసుల్లో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ నెల 6న రామేశ్వరపల్లి గ్రామంలో ఒక ఇంటిలో, 8న భిక్నూర్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన దొంగతనాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న లంబాడీ శ్రావణి (21), గుమ్మడిదల గ్రామం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో ఆమె తన భర్త మోచి శ్రీనివాస్తో కలిసి దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకుంది. స్క్రాప్ సేకరించి అమ్మే పనితో జీవనం సాగిస్తున్న వీరు ఆదాయం సరిపోక గత కొంతకాలంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడైంది. పోలీసుల ప్రకారం, 6న ఉదయం పల్సర్ బ్పై రామేశ్వరపల్లి చేరుకున్న ఇద్దరూ గ్రామ ప్రవేశద్వారం వద్ద శ్రీనివాస్ వేచి ఉండగా, శ్రావణి ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకునే వ్యక్తిలా నటిస్తూ గ్రామంలో తిరిగి తాళం వేసిన ఇళ్లను పరిశీలించింది.
ఎస్సీ కాలనీలో ఒక ఇంటికి తాళం వేసి ఉండటం గమనించి, ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి రెండు జతల వెండి పట్టేగొలుసులు, రూ.10 వేల నగదు దొంగిలించి పరారయ్యారు. తర్వాత 8న మళ్లీ భిక్నూర్ మండల కేంద్రానికి వచ్చి ఇదే విధంగా గ్రామంలో తిరిగిన శ్రావణి, శ్రీ వేంకటేశ్వర ఆలయంలోకి గోడ దూకి ప్రవేశించి తాళం పగలగొట్టి హుండీ డబ్బులు దొంగిలించే ప్రయత్నం చేసింది. అయితే గుడి పూజారి గమనించడంతో అక్కడి నుంచి పారిపోయారు.
విచారణలో గత ఫిబ్రవరిలో సంగారెడ్డి జిల్లా పుల్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదిమానిక్ గ్రామంలో కూడా ఇదే తరహాలో ఒక ఇంటిలో నాలుగు తులాల బంగారం, వెండి పట్టేగొలుసులు, నగదు దొంగిలించినట్లు శ్రావణి తెలిపింది. దొంగిలించిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన స్క్రాప్ వ్యాపారి పర్థం ఏలియా @ ప్రవీణ్కు అమ్మినట్లు వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా, దొంగ సొత్తు అని తెలిసినా కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు.
ఆ బంగారు ఆభరణా లపై IIFL బ్యాంకులో గోల్ లోన్ కూడా తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు నిందితుల వద్ద నుండి ఒక సామ్సంగ్ కీప్యాడ్ మొబైల్, ఒక IQOO స్మార్ట్ ఫోన్, రెండు జతల వెండి పట్టేగొలుసులు, నేరానికి ఉపయోగించిన హోండా షైన్ మరియు పల్సర్ NS 200 మోటార్ సైకిళ్లు, రూ.2,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలు శ్రావణిని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మోచి శ్రీనివాస్ పరారీలో ఉండగా అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్త్స్ర డి. ఆంజనేయులు తెలిపారు.




