06-02-2026 08:42:01 PM
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన చోట పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుతంగా జరిగేలా అన్ని భద్రత చర్యలు పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కామారెడ్డిలో సాధారణ ఎన్నికల పరిశీలకులు ప్రశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ లు విక్టర్, మధుమోహన్, ఆర్డీవో వీణ, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.అనంతరం సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించిన, అజెండాలో భాగంగా పోలింగ్ బృందాల తయారీ, పోలింగ్‌కు అవసరమైన సామగ్రి పంపిణీ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
పోలింగ్ బృందాల నియామకం పారదర్శకంగా, సమర్థవంతంగా జరగాలని, ఎన్నికల సామగ్రి సమయానికి అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఎన్నికల అబ్జర్వర్ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు తో పాటు భోజనవసతి కల్పించాలని పోలింగ్ సిబ్బంది ఎలాంటి అసౌకర్యం లేకుండా విధులు నిర్వహించేలా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.