4 July, 2026 | 3:51 AM

పరిశీలించి.. పరీక్షించి...

04-07-2026 12:00 AM

ప్రశ్నించి సామర్థ్యాలు తెలుసుకున్న కలెక్టర్

చెన్నూర్, జూలై 3 : విద్యా సంస్థలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు గత ఏడాది చదివిన తరగతికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ వారి సామర్థ్యాలను అడిగి తెలుసుకుంటున్నారు... గత ఏడాది సైతం ఏ మండలానికి వెళ్లినా పాఠశాలలను, కళాశాలలను సందర్శించి విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించడమే కాకుండా వారికి సామర్థ్యాలను పరిక్షించి ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.

వారానికోసారి రివ్యూ మీటింగ్ లు పెడుతూ కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించేందుకు తనవంతు కృషి చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఈ ఏడాది మొదటి నుంచే ఎక్కడికి వెళ్లినా విద్యార్థుల విద్యా, సౌకర్యాలపై దృష్టి సారించారు. కలెక్టర్ ఏ రోజు ఏ మండలానికి వస్తారో, ఏ పాఠశాలకు వస్తారోనని ఉపాధ్యాయులు సైతం అలర్ట్ గా ఉంటున్నారు. కలెక్టర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమంతో పాటు విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.