14 May, 2026 | 3:11 AM

కొనుగోళ్లు వేగవంతం చేయాలి

14-05-2026 12:53 AM

* అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం

చిగురుమామిడి, మే12 (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం ఎక్కువగా కొనుగోలు కేంద్రాలకు రావడంతో గన్ని బ్యాగ్స్ ఇబ్బందులు తలెత్తకుండా సెంటర్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

కాంటా పూర్తయిన వెంటనే ధాన్యం సంచు లు లారీలు, ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు పం పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.ధాన్యం తడువకుండా అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు అందుబాటులో ఉండాలన్నారు. రవాణా తరలింపులో ఇబ్బందులు లేకుండా ఎంవీఏ అధికారిని నియమించినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇల్లు పూర్తయిన కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశంలో పాల్గొన్నారు.

మొదటి విడతగా నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇల్లు వేగవంతంగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు జూన్ లో అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సర్పంచ్ గూళ్ల రజిత రాజు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంపత్, ఏఈఓ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.