పాఠశాల సమయాల్లో ఆర్టీసీ సేవలు
- విద్యార్థులు వేచిచూడకుండా బస్సులు నడపాలి
- అధికారులను ఆదేశించిన ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల రాకపోకల కోసం ఆర్టీసీ బస్సు సేవలను పకడ్బందీగా అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2026- విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులను నడపాలని రాష్ట్రంలోని అన్ని రీజియన్‌ల అధికారులను ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు. నూతన విద్యాసంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉన్నందున, విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల పాఠశాల సమయాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించాలని, గతంలో నడిపిన అన్ని పాఠశాల రూట్లను విధిగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ఖచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు.






