4 July, 2026 | 2:27 AM

సన్న వరి సాగుకుసై అన్నదాతకు ఆంక్షలు

04-07-2026 01:19 AM
  1. సన్నాళ్ల వైపే ప్రభుత్వం మొగ్గుచూపు
  2. విత్తనాలకు డిమాండ్
  3. ధరలు పెంచిన వ్యాపారులు
  4. వర్షంపైనే ఆధారం... ప్రాజెక్టులు నిండితేనే పంట
  5. విత్తనాలకు, క్రిమిసంహారక మందులకు పెరుగనున్నపెట్టుబడి

ఎల్లారెడ్డి, జూలై 3, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం సన్న వరి రకాలనే సేకరించాలని నిర్ణయించడం, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో సన్నబియ్యం భోజనం వడ్డించడం, కేంద్రం కొనుగోలు చేసిన మేరకే ధాన్యం సేకరిస్తామనడంతో రైతులు అనివార్యంగా సన్నవరి రకాల సాగుకు సన్నద్ధమవుతున్నారు. పంటకాలం పెరగడంతో పాటు చీడపీడలు ఎక్కువగా ఆశించే అవకాశాలుండడంతో పెట్టుబడి ఎక్కువ అవుతుందనే భయం ఉన్నా రైతులు సన్న వరి రకాల సాగుచేయడం తప్పడం లేదు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సేకరించే ధాన్యంతో సరిపెట్టకుండా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడంతో స్వల్పకాలిక దొడ్డు రకం వరిని ఎక్కువగా పండించే వారు. దొడ్డు రకం పారాబాయిల్ రైస్కు అనువుగా ఉండడంతో మిల్లర్లు కూడా కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం సన్నవరి రకాలనే అది కూడా రాష్ట్రంలో, బయటా డిమాండ్ ఉన్న ఏడు రకాల వరిని మాత్రమే సాగు చేయాలని వ్యవసాయ శాఖ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. తెలంగాణ సోన, కూనారం వరి-2, జై శ్రీరాం, కేఎనఎం-7715, బీపీటీ (సాంబమసూరి), హెచఎంటీ సోనా, వరంగల్-44, (సిద్ది) రకాలను సాగు చేయమని ప్రభుత్వం సూచిస్తున్నది.

వర్షాభావ పరిస్థితులపై ఆందోళన

రెండు కాలాలకు అనుకూలమైన తెలంగాణ సోనా, కూనారం వరి-2 రకాలపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. మిగతా ఐదు రకాలు కూడా వానాకాలం సాగుకు అనుకూలమైనవి అయినా సాంబమసూరి 145-150 రోజులు, హెచఎంటి సోనా 135 రోజులు, డబ్ల్యూజిఎల్ -44 145 నుంచి 150 రోజులు పంటకాలం కావడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా నార్లు కూడా పోయలేని పరిస్థితిలో ఉన్నారు.

మరో వైపు దీర్ఘకాలిక పంటలకు నీరు అందదేమోనని రైతులు ఆందోళన పడుతున్నారు. తెలంగాణ సోనా 125 రోజులు, కూనారం వరి-2 120 నుంచి 125 రోజులు పంటకాలం కావడంతోపాటు అతి సన్నరకం గింజ ఉండడం, దిగుబడి ఎకరాకు 26 నుంచి 30 క్వింటాళ్ల చొప్పున రావడం, అగ్గి తెగులు, పొట్టకుల్లు తెగులు, కుల్లికోడు తెగుళ్లను ఈ రకాలు తట్టుకునే పరిస్థితి ఉండడంతో రైతులు వాటి సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. జైశ్రీరాం, కేఎనఎం-7715, హెచఎంటీ సోనా రకాలకు 135 రోజుల పంట కాలం ఉంటుంది. దిగుబడి 25 నుంచి 28 క్వింటాళ్లు ఎకరాకు వచ్చే అవకాశ మున్నది. వీటికి కూడా రెండవ ప్రాధాన్యత క్రమంలో సాగు చేయవచ్చని ఆలోచిస్తున్నారు.

అందుబాటులో యూరియా 

కామారెడ్డి, జిల్లాలో ఈ సీజనలో, సుమారు, 3,15,000 ఎకరాల్లో వరి సాగు కు సిద్ధం ఉండగా, సన్న రకం ధాన్యం పంటను సుమారు2,60,000 వేల ఎకరాల్లో, సన్నవరి పంట జరుగుతుందని, దీనికి 65,700 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఏడు సన్న రకాలలో కూనారం-2, తెలంగాణ సోనాకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారస్తులు అన్ని విత్తనాలను అందుబాటులో ఉంచినా ఈ రకం విత్తనాలను ఎక్కువగా స్టాక్ పెట్టారని సమా చారం. ప్రభుత్వం సన్నరకాలనే సాగు చేయాలనడంతో వ్యాపారులు సన్నరకాల విత్తనాల ధరలు పెంచి, అమ్మినట్లయితే కఠిన చర్యలు తక్కువ అని అన్నారు. యూరియా పట్ల రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.

-జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి

లక్ష పదివేల ఎకరాల్లో సన్నవరి

ఎల్లారెడ్డి డివిజన్లో ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట గాంధారి మండలాల్లో రైతులు వానాకాలం పంటలో సుమారు లక్ష పదివేల ఎకరాల్లో సన్నవరి ధాన్యం పంటను వేస్తున్నట్లు ఎల్లారెడ్డి డివిజన్ వ్యవసాయ అధికారి సుధా మాధురి తెలిపారు. రైతులు ఎల్లారెడ్డి డివిజన్లో బిపిటి, కేఎన్‌ఎమ్ 1638, తెలంగాణ సోనా ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకాలను రైతులు అధికంగా విత్తనాలను విక్రయిస్తున్నారని రైతులు ఎక్కువ మేరకు ఈ సన్నారకం దాన్య పై మొగ్గు చెబుతున్నారని ఆమె తెలిపారు. రైతులకు ఎవరైనా ఫర్టిలైజర్ దుకాణం యజమానుదారులు ఎమ్మార్పీ ధర కంటే అధికంగా విత్తనం బస్తాలను విక్రయించినట్లయితే చర్యలు తీసుకుంటామని అన్నారు.

రైతులకు ఈ సంవత్సరం ఈ పంటకు సరిపడా యూరియా గోదాముల్లో ప్రాథమిక సహకార సంఘం పలు ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణ సముదాయాలలో నిలువ ఉందని రైతులు యూరియా పట్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పట్టా భూములు కాకుండా అసైన్డ్ భూములు కానీ కొన్ని సంవత్సరాల నుండి సాగులో ఉన్న రైతులకు కూడా రెవెన్యూ శాఖ వారి నుండి సంబంధిత ధ్రువపత్రాలు వ్యవసాయ శాఖ అధికారులకు అందించినట్లయితే యూరియా అందించే సదుపాయం ఉన్నట్లు రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు

ఎల్లారెడ్డి డివిజన్ వ్యవసాయ 

అధికారి సుధా మాధురి