జోరుగా చెట్ల నరికివేత..!
పేట్రేగిపోతున్న కట్టెల వ్యాపారస్తులు
తూప్రాన్ మండలంలో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ వ్యాపారం
అనుమతులు లేకుండానే నరికివేత..
తూప్రాన్, జులై 3: తూప్రాన్ మండలం పరిసర ప్రాంతాలలో చెట్ల నరికివేత విపరీతంగా కొనసాగుతుంది. గత కొంతకాలంగా కట్టే మిషన్ వ్యాపారస్తులు పర్మిషన్ ఉన్నా లేకున్నా పొలాల వద్ద, వాగు సమీపాలలో ఎక్కడపడితే అక్కడ పకృతికి పట్టుకొమ్మలుగా ఉన్న చెట్లను నరికి పర్యావరణాన్ని పూర్తి గా దెబ్బతీస్తున్నారు. కలప నరికివేత సమయంలో మీకు పర్మిషన్లు ఉన్నాయా అని నిలదీస్తే మీకెందుకు అని దురుసుగా సమాధానం చెబుతున్నారు.
ప్రకృతిలోనీ చెట్లను నరి కి వేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ప్రకృతి పరంగా భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి నెలకొంటుం ది. ఇదిలా ఉండగా గురువారం తూప్రాన్ లోని శ్రీనివాస కట్టే మిషన్ యాజమాని ట్రాక్టర్ల ద్వారా విలువైన తుమ్మ మొద్దులను నరుక్కొని టాక్టర్ లోడుతో తన యొక్క కట్టే మిషన్ లోకి తరలిస్తున్నాడు. ఇలా ప్రతీ రోజు జోరుగా వ్యాపారం సాగుతున్నా పట్టించుకునే వారు లేరు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వివరణ
ఈ నేపథ్యంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంబర్ సింగ్ వివరణ కోరగా.. శుక్రవారం తూప్రాన్ పట్టణ సమీపంలోని పోతరాజు పల్లి శ్రీనివాస్ కట్టే మిషన్ లో వేసిన తుమ్మ మొద్దులను పరిశీలించామన్నారు. ఎక్కడ అయిన సరే అధికారుల పర్మిషన్ లేకుండా ఆన్లైన్ పర్మిషన్ లేకుండా చెట్లను నరికి వేస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.






