20 April, 2026 | 2:53 AM

వైద్యరంగంలో పరిశోధన నిత్యనూతనం

20-04-2026 01:05 AM

ఆధునిక వైద్యంలో విప్లవాత్మక మార్పులు

కాంటికాన్ సదస్సులో ప్రముఖ వైద్యులు

సదస్సు నిర్వహణపై కాంటినెంటల్ ఆసుపత్రి చైర్మన్ గురు ఎన్ రెడ్డి సంతోషం

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): వైద్యరంగంలో పరిశోధన అనేది నిత్యనూతనమని, పరిశోధనలతోనే విప్లవాత్మక మార్పులు సాధ్యమని, జరిగాయని, ఆధునిక వైద్య విధానానికి ఇవే కీలకం కాబోతు న్నాయని కాంటినెంటల్ ఆసుపత్రి ఫౌండర్, చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అన్నారు.

18, 19 రెండు రోజులపాటు ఆసుపత్రిలో ‘కాంటికాన్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే గాకుండా దేశం నలుమూలల నుంచి 300 మంది డెలిగేట్స్, 50 మందికిపైగా ప్రొఫెసర్లు, వైద్యులు, ఫిజిషియన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు, ఛాన్సలర్, ప్రొఫెసర్ కే శ్రీనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను సదస్సులో పంచుకున్నారు.

జీడీఆర్ మెమోరియల్ వేదిక ద్వారా ప్రజారోగ్య నిపుణులు, వైద్యులు, పాలసీ మేకర్స్‌ను ఒక్కచోట చేర్చడం సంతోషంగా ఉందని గురు ఎన్ రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆరోగ్య సంరక్షణ విధానాలు, మల్టీ డిసిప్లినరీ హెల్త్ రీసెర్చ్‌లో ఎలా ఉండాలి అనే విషయాలను డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి వివరించారు.

వైద్య పరిశోధన, బిగ్ డేటా, కాంప్లెక్స్ సిస్టమ్స్ నిర్మా ణం, ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ప్రభావంపై పలు విషయాలను పంచుకున్నారు. ప్రజారోగ్యంపై నిబద్ధతతో పనిచేస్తూ, ఆరోగ్య సంర క్షణ, పరిశోధనలలో పనిచేస్తున్న భారతదేశ అగ్రశ్రేణి వైద్యులలో ఒకరైన శ్రీనాథ్‌రెడ్డి ఈ సదస్సులో పాల్గొనడంపై డాక్టర్ గురు ఎన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జీడీఆర్ మె మోరియల్ ప్రొఫెసర్ కల్పలత గుంటుపల్లి, మేయో క్లినిక్ అమెరికాకు చెందిన ప్రొఫెసర్ జాన్ బి. కిసీల్‌లకు అభినందనలు తెలిపారు.