యూనియన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం!
యూనియన్ లో చేరమనడంలో తప్పేముంది?
జేసీబీ యూనియన్‌పై తప్పుడు ఆరోపణలు ఖండన!
ధర్మపురి,మే11(విజయక్రాంతి): వెల్గటూర్ మండల జేసీబీ యూనియన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని యూనియన్ సభ్యులు హెచ్చరించారు. సోమవారం ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనాన్ని యూనియన్ సభ్యులతో కలిసి ఖండించారు. తాము ఎవరినీ బలవంతంగా డబ్బులు కట్టమని ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. యూనియన్‌లో సభ్యత్వం తీసుకోవాలని అడగడంలో తప్పేముందని ప్రశ్నించారు. అప్పులు చేసి జేసీబీలు కొనుగోలు చేసి, ప్రతినెల ఫైనాన్స్‌లు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. జేసీబీ యూనియన్‌ను 2024లో రిజిస్ట్రేషన్ చేశామని, ప్రస్తుతం యూనియన్‌లో రూ.5.40 లక్షల నిధులు నిల్వ ఉన్నాయని వెల్లడించారు.
సభ్యుల నిర్ణయాల ప్రకారమే కొన్ని నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని చెప్పారు. కొత్తగా జేసీబీలు కొనుగోలు చేసిన వారిని యూనియన్‌లో చేరాలని కోరుతున్నామని, ఇదే క్రమంలో స్థంభంపెల్లి గ్రామానికి చెందిన పాకల నరేష్‌ను కూడా సభ్యత్వం తీసుకోవాలని అడిగినట్లు వివరించారు. యూనియన్ నిధుల ప్రకారం సభ్యత్వం రూ.35000/- చెల్లించాల్సి ఉంటుందనీ, ప్రస్తుతం అయితే రూ.8000 చెల్లించి సభ్యత్వం పొందాలనీ కోరినట్లు వివరించారు.సభ్యత్వం గురించి మాత్రమే చెప్పామని, కానీ ఎప్పుడూ డబ్బులు చెల్లించాలనీ ఒత్తిడి చేయలేదన్నారు. పాకల నరేష్ సభ్యత్వం తీసుకోక పోగా, తమ యూనియన్ పైనే నిందలు వేస్తూ, ఒక్క రూపాయి కూడా కట్టననీ, ఏం చేసుకుంటారో చేసుకొమ్మనీ యూనియన్ సభ్యులపైనే దురుసు ప్రవర్తన చేసినట్లు యూనియన్ సభ్యులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘన అంశంపై మండల తహసీల్దార్‌ను కూడా కలిసి వివరించినట్లు తెలిపారు. పాకల నరేష్ యూనియన్‌లో చేరకుండా, ఇప్పుడు తానే యూనియన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని యూనియన్ సభ్యులు ఆరోపించారు.






