11 May, 2026 | 3:33 PM

వెంచర్లో అక్రమాలపై కుల సంఘాల పిర్యాదు

11-05-2026 02:04 PM
  1. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్పందించి న్యాయం చేయాలి.
  2. విజయక్రాంతి వార్త కథనంతో ఒక్కటైన బాధితులు. 
  3. అక్రమార్కుల ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక.

బిజినేపల్లి:  కందనూల్ జిల్లాలోని క్విడ్ ప్రొఖో వ్యవహారంలో మండల కేంద్ర శివారులోని 101 సర్వే నెంబరులో వేసిన వెంచరులో చోటు చేసుకున్న అక్రమాలపై అధికారులు విచారణ జరిపి న్యాయం చేస్తూ అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాలమూరు నిర్వాసిత బాధితులు,  ఎల్.హెచ్. పీ.ఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు మాన్య నాయక్, మంగి విజయ్ లు సోమవారం మండల తహశీల్దారు కార్యాలయంలో పిర్యాదు చేశారు. రిజర్వాయర్ లో ఇండ్లు,భూముల పరిహారాన్ని క్విడ్ ప్రాకో కింద బిఆర్ఎస్ నేతల మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.  భూములు కోల్పోయిన గిరిజనులను ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న అప్పటి అధికార పార్టీ నాయకుడు తనకున్న రెండు ఎకరాల భూమికి బదులు 6.06 ఎకరాల్లో వెంచర్ వేసి మోసం చేశాడని ఆరోపించారు. విజయక్రాంతి పత్రిక అండగా నిలిచిందన్నారు.

అప్పటి అధికార పార్టీ నాయకుడు, ఇప్పటి అధికార పార్టీ నాయకుడితో కలిసి గిరిజనులను మోసం చేస్తున్నారని, వారి గళం విప్పకుండా గొంతు నొక్కి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.  తమ వ్యవసాయ భూముల్లో చేపట్టిన ప్రాజెక్టులతో నష్టపోయిన గిరిజనులకు, అక్రమ వెంచర్ల ద్వారా మోసం చేసిన అక్రమార్కులపై అధికారులు చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బాధితులకు న్యాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. అక్రమార్కులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితులకు  న్యాయం చేయాలని, లేకుంటే వారి ఇండ్లనే బాధితులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు బాధిత అక్రమార్కులకు తగిన న్యాయం చేయకపోతే కుల సంఘాల ద్వారానే రాష్ట్ర స్థాయి పోరాటం చేసేందుకు భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు మహేందర్,  గోవిందు నాయక్, కరిగల్ల దశరథం, హన్మంతు నాయక్, వెంకటేష్, బత్తుల వెంకటేష్, గిరిజన సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.