12 July, 2026 | 1:32 AM

పార్టీ ఆదేశిస్తే సిద్దిపేట నుంచి పోటీకి సిద్ధం

12-07-2026 12:36 AM
  1. అభ్యర్థుల ఎంపికలో సీఎం, పీసీసీదే తుది నిర్ణయం
  2. చిట్‌చాట్‌లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే హరీశ్ రావుపై సిద్ది పేట నుంచి పోటీ చేసేందుకు కూడా సిద్ధమేన ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని చెప్పానని, అయితే మరో నియోజకవర్గంలో పోటీ చేయబోనని ఎప్పుడూ చెప్పలేదన్నారు. సంగారెడ్డిలో మహిళా లేదా జనరల్ స్థానం ఏదైనా నిర్మలనే కాంగ్రెస్ అభ్యర్థి అవుతారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి కే రాజకీయ వ్యూహాన్ని ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వం రెండోసారి అధికారంలో కి రావాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధం గా ముందుకెళ్లడం అవసరమని చెప్పారు.

రేవంత్ తీసుకునే నిర్ణయాలు, వ్యూహాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు. 117 అసెంబ్లీ స్థానాలను గెలిపించుకునే లక్ష్యంతో సీఎం కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ఇన్‌చార్జి తీసుకునే నిర్ణయమేనన్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారని, పనితీరు బాగాలేని ప్రజాప్రతినిధులకు సూచనలు చేస్తున్నారని చెప్పారు.

సర్వేలపై అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి అన్నారు. ఎవరి సర్వేలు వారికి అనుకూలంగానే వస్తాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తొలిసారి సీఎం సమయంలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతికూల సర్వేలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ‘సిట్టింగ్ ఎమ్మెల్యేలు తోపులు కారు.. సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ నిర్ణయాలే కీలకం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతంగా తోపులు ఉండరు’అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.