అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు రేషన్ తప్పనిసరి
రేషన్ దుకాణంలో అధికారి ఫోన్ నంబర్ ఉంచాలి
రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, సభ్యురాలు శారద
మీలో పిల్లలకు ఇలాగే వంటలు చేస్తారా అని హెచ్‌ఎంపై ఆగ్రహం
అచ్చంపేట, మార్చి 13: అంత్యోదయ కార్డులు కలిగిన లబ్ధిదారులకు చౌకధర దు కాణాలలో తప్పని సరిగా బియ్యం ఇవ్వాలని.. అతిక్రమించే దుకాణాల నిర్వాహకు లపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కమిషన్ సభ్యురాలు శారద హెచ్చరించారు. కేవలం రేషన్ దుకాణాల నుంచి వచ్చే నిత్యవసరాలతో జీవించే సామాన్యులకు బియ్యం సరఫరా చేయకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం ఆయన అచ్చంపేటలోని 6వ నిత్యవసర సరుకుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్తాలో ఉన్న బియ్యాన్ని తూకం వేయించి చూశారు. అంత్యోదయ కార్డులకు రేషన్ బియ్యం పంపిణీ గురించి ఆరా తీయగా ఇవ్వడం లేదని చెప్పడంతో.. ఎందుకు ఇవ్వడంలేదని కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరూ అంత్యోదయ కార్డుల ప్రకారమే రేషన్ బియ్యం ఇవ్వాలని అడుగుతున్నారని అందుకే పంపిణీ చేయడం లేదనే సమాదానంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు షాపును రద్దు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఇప్పటి వరకు అంత్యోదయ కార్డుల లబ్ధిదారులకు కలిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. సంబంధిత చట్టం ప్రకారం లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇవ్వకపోతే నష్టాన్ని సంబంధిత అధికారులు, డీలర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి అందించాల్సిన పప్పు నీళ్లగా మాదిరిగా ఉందని మండిపడ్డారు. చింతల్ బస్తీలోని అంగన్వాడీ కేంద్రం నెల రోజులుగా మూతపడి ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
అక్కడి నుంచి సివిల్ సప్లై గోదాంకు వెళ్లి పరిశీలించారు. జడ్పీ బాలికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం కొంతమంది విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకుని తినేందుకు సిద్దమవుతుండగా.. పాఠశాలలో సరిగా వండటం లేదా.. ఇంటి నుంచి ఎందుకు తెచ్చుకున్నారని విద్యార్థులను అడిగారు. విద్యార్థులకు అందించే మిడ్ డే మీల్స్ భోజనాన్ని పరిశీలించి.. వండిన కూరలు ఏమిటని హెచ్‌ఎం అడగగా తడబడుతూ తప్పుడు సమాదానం చెప్పడంతో చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్లలోని పిల్లలకు ఇలాంటి భోజనం ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డివో యాదగిరి, ఏటిడిఓ ఫిరంగి, డిఈఓ రమేష్, తాహసిల్దార్ సైదులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




