14 March, 2026 | 3:22 AM

మంచి పనికి.. అడ్డుపడకండి!

14-03-2026 01:58 AM

మూసీ ఇన్వైట్స్

పేదలు మాకు శత్రువులు కాదు

  1. మూసీ గట్టున మూడు నెలలు ఉండగలరా?
  2. విపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
  3. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే చరిత్ర క్షమించదు 
  4. ‘గాంధీ సరోవర్’ కోసం రక్షణ భూమి కేటాయించిన కేంద్రానికి ధన్యవాదాలు 
  5. థేమ్స్, సియోల్ నదుల తరహాలో నైట్ ఎకానమీ: సీఎం రేవంత్‌రెడ్డి 
  6. మూసీ ఇన్వైట్స్ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్

హైదరాబాద్, సిటీబ్యూరో మార్చి 13 (విజయక్రాంతి): మూసీ అంటే కేవలం మురుగు కాల్వ కాదు.. అది భాగ్యనగరానికి శాపంలా మారిన ఒక విషాదం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ మురికిని ప్రక్షాళన చేసి నగరానికి పునర్వైభవం తీసుకురావాలన్న మా సంక ల్పాన్ని ఎవరూ అడ్డుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మూసీ పరివాహక ప్రాం తంలోని బాధితుల పట్ల ప్రభుత్వం అత్యంత మానవతా దృక్పథంతో ఉంద ని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

‘మేం ఎవరి ఆస్తులూ గుంజుకోవడం లేదు. పేదవాళ్ల ను నిరాశ్రయులను చేయాలని మేం అనుకోవడం లేదు. పేదలు మాకు శత్రువులు కాదు. వారితో శత్రుత్వం పెంచు కుంటే ఎవరైనా మళ్లీ అధికారంలోకి వస్తారా?.. బాధితులకు ఇచ్చే పరిహారంపై సూచనలు చేయండి. మూసీ జన ఆందోళన్ సంఘంతో మాట్లాడి ఇండ్లు, స్కూళ్ల నిర్మాణంతో పాటు ఉపాధి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టును అడ్డుకుంటున్న వారు ఒక్క మూడు నెలలు అక్కడ నివసించగలరా అని ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. శుక్రవారం హోటల్ తాజ్ కృష్ణలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ నది గత వైభవం, ప్రస్తుత దుస్థితి, భవిష్యత్తులో అది ఎలా మారబోతుందో దృశ్యరూపంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, రాజకీయ లబ్ధికోసం బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన నిప్పులు చెరిగారు.

అధికారమంటే ఆధిపత్యం కాదు, ప్రజలకు కాపలాదారుగా ఉండటమేనని తమ ప్రభుత్వం నమ్ముతుందని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. గోదావరి జలాలు ౨౦ టీఎంసీలను మూసీకి తరలించే పనులు చేపట్టామని, మూసీలో నిరంతరం ౨.౫ టీఎంసీల గోదావరి జలాలు ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ అన్నారు. మిగతా ౧౭.౫ టీఎంసీల గోదావరి జలాలతో హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేయత్నం చేస్తున్నామని సీఎం తెలిపారు.  

రాక్షసుల వల్ల ఆగదు..

లోకకళ్యాణం కోసం చేసే యజ్ఞాలను రాక్షసులు భగ్నం చేయాలని చూసినా అవి ఆగవని, సుబాహు మారీచుల లాంటి వారు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని హెచ్చరించారు. వంద ఏళ్ల తర్వాతి తరాలు మనల్ని చూసి గర్వపడాలని.. అప్పుడు నిజాం పాలకులు చేసిన దానికి మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని, ఇప్పుడు మనం అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఈ చారిత్రాత్మక మార్పుకు తాను సారథ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నానని, అడ్డంకులు సృష్టించే వారిని ప్రజలే నిలదీయాలని కోరారు. పవర్ పాయింట్  కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విదేశీ దౌత్యవేత్తలు, వాణిజ్య దిగ్గజాలు, పర్యావరణ నిపుణులు హాజరయ్యారు. వారంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అభినందించారు.

గాంధీ సరోవర్  కేంద్రం సానుకూలత.. 

మూసీ పునరుజ్జీవనంలో భాగంగా చేపట్టనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అపూర్వమైన సానుకూల స్పందన లభించిందని సీఎం వెల్లడించారు. అక్కడ ప్రస్తుతం అగ్నివీర్ శిక్షణ జరుగుతున్నప్పటికీ, హైదరాబాద్ నగరం కోసం ఆ క్యాంపును వేరే చోటికి మార్చి, 100 ఎకరాలకు పైగా భూమిని ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి సిద్ధమయ్యారని తెలిపారు.

కేంద్రం అంతలా సహకరిస్తుంటే, పదేళ్లు పాలించిన ఇక్కడి స్థానిక నేతలు మాత్రం ప్రాజెక్టుపై విషం చిమ్మడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖకు సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వందఏళ్ల క్రితం 1908 వరదల సమయంలో నిజాం పాలకులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నిర్మించారని, ఆనాడు ఎంతో విశాలంగా ఉన్న మూసీని గత పాలకులు అడ్డగోలు నిర్మాణాలతో కుంచించుకుపోయేలా చేశారని సీఎం విమర్శించారు.

నది మధ్యలో ఎస్టీపీ పైపులైన్లు కట్టి, మురుగు నీరు సాఫీగా వెళ్లకుండా అడ్డుకట్ట వేశారని, దానివల్ల కొద్దిపాటి వర్షం రాగానే కాలనీలు మునిగిపోతున్నాయని ఆయన వివరించారు. మూసీ నీళ్లు కేవలం మురికిగా లేవని, అందులో కలిసే కాలుష్యాలవల్ల నీరు విషంగా మారిందని, ఆ విషపు నీళ్లతో పండించిన పంటలు తిని నల్లగొండ ప్రజలు రోగాలబారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

నైట్ ఎకానమీ.. 

మూసీ నది మధ్య నుంచి ఇరువైపులా 100 మీటర్ల చొప్పున మొత్తం 200 మీటర్ల వెడల్పుతో బృహత్ కారిడార్‌ను అభివృద్ధి చేయబోతున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక విప్లవాన్ని మనం ఆమోదించాలని, ఏఐ వంటి సాంకేతికత వల్ల వైట్‌కాలర్ ఉద్యోగాలు తగ్గిపోతున్న తరుణంలో, మూసీ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మందికి బ్లూ కాలర్ ఉద్యోగాలను, పర్యాటక రంగంలో ఉపాధిని సృష్టిస్తామన్నారు.

లండ న్‌లోని థేమ్స్ నది, దక్షిణ కొరియాలోని సియోల్ రివర్‌ఫ్రంట్ తరహాలో మూసీని తీర్చిదిద్దుతామని, రాత్రి వేళల్లో కూడా నగరం కళకళలాడేలా నైట్ ఎకానమీని ప్రోత్సహిస్తామని చెప్పారు. చార్మినార్ చుట్టూ స్పెషల్ ఎకనామిక్ జోన్ తరహాలో అభివృద్ధి చేసి, హైదరాబాద్‌ను ప్రపంచ పర్యాటక ప టంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. బాపూ ఘాట్ వంటి చారిత్రక ప్రదేశాలకు పూర్వవైభవం తెస్తామని, ఎవరికో నష్టం కలిగిం చాలన్నది తమ ఉ ద్దేశం కాదని, పేదలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్య మని సీఎం స్పష్టం చేశారు.

కంటైనర్ హౌస్ ఇస్తా.. ఉండి చూస్తారా!

ప్రస్తుతం మూసీ చుట్టుపక్కల నివసిస్తున్న పేదలు దోమలు, భరించలేని దుర్వాసన, విషపూరిత వ్యర్థాల మధ్య ఎలా మగ్గుతున్నారో మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారికి తెలుసా?, ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశపూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఏసీ గదుల్లో కూర్చుని రాజకీయాలు చేసేవారు తమ కుటుంబసభ్యులతో కలిసి ఒక్క మూడునెలలు అక్కడ ఉండండి.

మీకు ఇబ్బంది అయితే ప్రభుత్వం తరపున అన్ని వసతులతో కూడిన కంటైనర్ హౌస్ ఇస్తాను. అప్పుడు తెలుస్తుంది అక్కడి ప్రజల ఆవేదన ఏంటో. మీ రాజకీయ స్వార్థం కోసం పేదల జీవితాలతో, వారి పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేవలం రూ. 200 కోట్లు కేటాయిస్తే, దానిని రూ. 500 కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేయడం విచారకరం.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి