15 June, 2026 | 3:38 AM

పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు

15-06-2026 01:16 AM

స్థలాలను పరిశీలించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

పెద్దపల్లి, జూన్ 14(విజయ క్రాంతి)పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన భద్రతా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన ప్రక్రియ వేగవంతమైంది. ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా లతో కలిసి పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

నాలుగు పోలీస్ స్టేషన్ల మంజూరు.ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, ఏకకాలంలో నాలుగు కొత్త పోలీస్ స్టేషన్లను మం జూరు చేశారని, వీటిలో ఎలిగేడు పోలీస్ స్టేషన్, పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లు ఉన్నాయన్నారు.  అనంతరం విప్ మాట్లాడుతూ.. నియోజకవ ర్గంలో శాంతిభద్రతల పరిరక్షణలో ఈ కొత్త స్టేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. స్టేషన్ల నిర్మాణానికి అనువైన స్థలాలను యుద్ధ ప్రాతిపదికన ఎంపిక చేసి, వాటిపై సమగ్ర నివేదికను సోమవారం సాయంత్రం లోపు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పెద్దపల్లిలో ఒకేసారి నాలుగు పోలీస్ స్టేషన్లు మంజూరు కావడం గర్వకారణమని, ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గ భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.