అమిత్‌షాను తప్పించాలి
ఆయనను కేంద్రమంత్రివర్గం నుంచి మోదీ తొలగించాలి
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు నేను ఎప్పటికీ క్షమాపణ చెప్పను
విద్యార్థులపై పెల్లెట్ గన్స్, షాక్ బ్యాటన్లు ప్రయోగించారు
స్టూడెంట్స్‌ను కరెంట్, మేకుల లాఠీలతో కొట్టారు
ఏఐసీసీ అగ్రనేత రాహుల్
న్యూఢిల్లీ, జూలై 29: ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడికి బాధ్యతగా కేంద్ర హోమంత్రి అమిత్‌షాను కేంద్రమంత్రి వర్గం నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్రమోదీని ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. అమిత్‌షాపై తాను చేసిన ఆరోపణలకు, బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు తాను ఎప్పటికీ క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. ఢిల్లీ నిరసనల్లో విద్యార్థులపై పోలీసుల దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.
అమాయకపు విద్యార్థులను కరెంట్, మేకులు కొట్టిన లాఠీలతో తీవ్రంగా కొట్టారు. వారిపై పిల్లెట్ గన్స్ పేల్చారు. పోలీసుల దాడుల్లో గాయపడిన విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. విద్యార్థులపై దాడి విజువల్స్‌ను దేశమంతా చూసింది. అమిత్‌షా ఆదేశాలతోనే ఈ అమానుష దాడి జరిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇందుకు అమిత్‌షా బాధ్యత వహించాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభలో తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబితే ప్రసంగాన్ని కొనసాగిం చేందుకు అనుమతి ఇస్తామని చెప్పారని, కానీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు తాను ఎప్పటికీ క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా దేశానికి సంబంధించిన అన్ని కీలక అంశాలను లేవనెత్తడం తన హక్కు అని, విద్యార్థులపై జరిగిన దాడి అత్యంత ముఖ్యమైన అంశమన్నారు. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై పాశవిక దాడిని లోక్‌సభలో ప్రశ్నించానని అన్నారు. విద్యార్థులపై దాడిని నిరసిస్తూ మాట్లాడుతుంటే తన గొంతు నొక్కారని విమర్శించారు.
కేంద్రమంత్రులు కిరణ్ రిజుజు, జితేంద్ర సింగ్ పదేపదే తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆగ్రహించారు. యువతపైకి పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, ఒక విద్యార్థి కన్ను పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. పోలీసులు మేకులు అమర్చిన లాఠీలతో దాడి చేశారని ఆరోపించారు. మహిళలు, మైనర్లపై బలప్రయోగం చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా అమిత్‌షా చిత్రాన్ని రాహుల్‌గాంధీ చూపిస్తూ.. విద్యార్థులతో ఇలా అన్నారు.
‘మిమ్మల్ని కొట్టింది, హింసించింది, అవమానించింది, పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపింది ఈ వ్యక్తే’ అని అన్నారు. ‘దెబ్బలు తిన్న విద్యార్థులకు న్యాయం జరిగేలా, విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపిన వారికి శిక్ష పడేలా మేము చూస్తాము’ అని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, అమిత్ షాను పదవి నుంచి తొలగించమని ప్రధానికి మా సలహా అని ఆయన తెలిపారు. పోలీసుల అరాచకాలుగా ఆరోపించబడుతున్న ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.






