రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలి
జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా వినతి
సిద్దిపేట, ఆగస్టు 5 (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడంతో పాటు విద్యుత్ సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ)కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయానికి విద్యుత్ అత్యంత కీలకమైనదని, ప్రస్తుతం జిల్లాలో రైతులు అనేక విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యుత్ సరఫరాకు నిర్దిష్ట సమయపాలన లేకపోవడంతో రైతులు రాత్రింబవళ్లు మోటార్ల స్టార్టర్ల వద్దే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోందని పేర్కొన్నారు.
ఓవర్లోడ్తో పనిచేస్తున్న ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, పంట పొలాల్లో ప్రమాదకరంగా ఉన్న లూజ్ విద్యుత్ స్తంభాలను వెంటనే బిగించాలని డిమాండ్ చేశారు. పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను వీలైనంత వరకు రహదారి పక్కకు మార్చి నిర్వహణ పనులు సులభంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రతి సబ్స్టేషన్ పరిధిలో సీఎల్, జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం సిబ్బందిని రైతులకు అందుబాటులో ఉంచి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, లో వోల్టేజ్ సమస్యను శాశ్వతంగా నివారించి తగిన వోల్టేజ్తో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా సిద్ధిపేట జిల్లా అద్యక్షులు వల్లపురెడ్డి రజనీకర్ రెడ్డి, బీజేపీ నంగునూరు మండల్ అధ్యక్షులు చౌడిచర్ల వెంకటరామిరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్తినేని రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నత్తి తిరుమల్ రెడ్డి, ఉపాధ్యక్షులు పరకాల తిరుపతిరెడ్డి, కోశాధికారి నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్కంటి ఏకొండ, సుతారి కార్తీక్ ముదిరాజ్, రైతులు పాల్గొన్నారు.






