6 August, 2026 | 1:10 AM

చెరువు బఫర్ జోన్‌లో దర్జాగా నిర్మాణం

06-08-2026 12:00 AM
  1. ఫిబ్రవరి లో సీజ్ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు
  2. నేడు యథావిధిగా పనులు ప్రారంభం
  3. మొద్దు నిద్రలో నిజాంపేట్ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ
  4. సర్కిల్ ఏసీపీ శ్రీనివాస్ స్పందించడం లేదు: ఆర్‌ఐ మల్లేశ్వరరావు

కుత్బుల్లాపూర్, ఆగష్టు 5 (విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని నిర్మాణదారులకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ప్రభుత్వ అధికారులు నిబంధనల ప్రకారం అక్రమమని నిర్ధారించి చేసి, నిర్మాణాన్ని సీజ్ చేసినా బరితెగిస్తూ ఆ సీల్ ను తొలగించి నిర్మాణాలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి, అధికారులకు సవాల్ విసుతున్నారు.

నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బాచుపల్లి లో ఓ అక్రమ నిర్మాణం స్థానికంగా చర్చనీయంశంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ నిర్మాణదారుడు బాచుపల్లి పెద్ద చెరువు బఫర్ జోన్ లో భవన నిర్మాణాన్ని చేపట్టాడు.గతం లో అక్రమ నిర్మాణం పై టౌన్ ప్లానింగ్ అధికారులకు వరుస ఫిర్యాదులు రావడం తో అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేశారు.

దర్జాగా  బఫర్ జోన్లోనే..

సదరు అక్రమ నిర్మాణం బాచుపల్లి పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో జరుగుతుందని నీటిపారుదల కు ఫిర్యాదు అందడంతో జనవరి నెలలో అధికారులు చెరువును, అక్రమ నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణం చెరువు బఫర్ జోన్ లో ఉందని నిర్ధారించిన అధికారులు అక్రమ నిర్మాణంపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హైడ్రా చెరువుల పై ప్రత్యేక దృష్టి సారించి చెరువులలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటూ తిరిగి చెరువులకు ప్రాణం పోస్తుంది. కానీ కొందరు నిర్మాణదారులు మాత్రం ప్రభుత్వాన్ని, అధికారులను ఏ మాత్రం లెక్క చేయకుండా చెరువులను మింగేస్తున్నారు.

ఫిబ్రవరి లో సీజ్... నేడు మళ్ళీ ప్రారంభం

సదరు అక్రమ నిర్మాణాన్ని పెద్ద చెరువు బఫర్ జోన్ లోనే నిర్మిస్తున్నారని సంబంధిత అధికారుల నుండి ఆదేశాలు రావడంతో ఫిబ్రవరి నెలలో అప్పటి నిజాంపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీదా నోటీసులు జారీ చేసి, సీజ్ చేశారు. అయితే కొన్ని నెలలు సైలెంట్ గా ఉన్న నిర్మాణదారుడు ఏసీపీ అధికారిని ఇక్కడి నుండి బదిలీ అవ్వడం తో తిరిగి నిర్మాణాన్ని ప్రారంభించాడు. నిర్మాణదారుడు చట్టాన్ని నిబంధనలను తుంగలో తొక్కి,చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని కీలు బొమ్మలా ఆడిస్తున్నారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

సర్కిల్ ఏసీపీ శ్రీనివాస్ స్పందించడం లేదు: ఆర్‌ఐ మల్లేశ్వరరావు

అక్రమ నిర్మాణంపై బాచుపల్లి ఆర్‌ఐ ని వివరణ అడగగా గతం లో అక్రమ నిర్మాణం పై ఫిర్యాదులు రావడం తో  నిర్మాణం పై చర్యలకు సర్కిల్ అధికారులకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాము.నేడు మళ్ళీ పనులు ప్రారంభం అవ్వడం తో ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ ను చర్యలు తీసుకోవడానికి సంప్రదించగా స్పందించడం లేదని తెలిపారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకుంటారా లేక నిర్మాణదారులకు సహకరిస్తారా వేచి చూడాలి.