6 August, 2026 | 1:24 AM

పేద విద్యార్థుల ఉద్యోగ లక్ష్యాలకు బీకేఎంఆర్ స్టడీ సర్కిల్ అండ

06-08-2026 12:15 AM

గద్వాలలో ఉచిత పోటీ పరీక్షల కోచింగ్ ప్రారంభం 

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, ఆగస్టు 5 (విజయక్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత కోచింగ్ అందించి ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు తోడ్పడాలనే లక్ష్యంతో గద్వాలలో బీకేఎంఆర్ స్టడీ సర్కిల్ను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.

భీమ్నగర్లోని శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం కమ్యూనిటీ హాల్లో బుధవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయన సతీమణి పాల్గొని సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సహకరించిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీస్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలతో పాటు గ్రూప్స్, బ్యాంకింగ్, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా పూర్తిగా ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. గతంలో కోచింగ్ కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు గద్వాల విద్యార్థులకు స్వస్థలంలోనే నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు.

పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ బండ్ల జ్యోతి మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పొందితే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సాధ్యమేనని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు, విద్యా ర్థులు తదితరులు పాల్గొన్నారు.