6 August, 2026 | 1:10 AM

రాహుల్ తీరు దురదృష్టకరం

06-08-2026 12:16 AM

నీ వ్యాఖ్యలను భవిష్యత్తు తరాలు క్షమించవు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 5(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీని, వారి మాతృమూర్తిని జుగుప్సాకరంగా దుర్భాషలాడిన వారిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వెనుకేసుకురావడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ఒక్క ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నాను. రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను ఇలాగే దుర్భాషలాడుతూ.. తిడుతూ ఎవరైనా మాట్లాడినా.. పోస్టులు పెట్టినా ఇలాగే వారిని వెనుకేసుకొస్తారా? అలాంటి ప్రవర్తనను మీరు స్వాగతిస్తారా? చెప్పండి అని అన్నారు.

రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను భవిష్యత్ తరాలు క్షమించవని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తప్పుడు మార్గంలో.. నోటికొచ్చినట్టు దురుసుగా, అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనుకేసుకొచ్చేలా.. అలా మాట్లాడినా, ప్రవర్తించినా తప్పు కాదన్నట్టుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడటం దారుణం అని తెలిపారు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి.. సొంత తల్లిని అన్ని మాటలన్నా కూడా ప్రధాని మోదీ చాలా హుందాగా, బాధ్యతాయుతంగా, పెద్దమనిషి తరహాగా వ్యవహరించారు.

చిన్న పిల్లలతో వారి భాషలో మాట్లాడారు. చిన్న పిల్లలన్నాక తప్పులు చేస్తారని, వారిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, టీచర్లు, సమాజానిదేనని ఆయన సున్నితంగా గుర్తుచేశారు. ప్రధాని మోదీ మాటల్లో ఎలాంటి ఆగ్రహం, ద్వేషం లేదు. కేవలం క్షమాగుణం, బాధ్యత మాత్రమే కనిపించాయి.

మోదీ మాటలకు స్పందించిన ఓ విద్యార్థిని స్వచ్ఛందంగా ముందుకొచ్చి క్షమాపణ చెప్పారు. ఇది భారతీయ నాగరికత విలువలను ప్రతిబింబిస్తోంది. యువత తమ తప్పును తామే గుర్తించి, స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు అంత అసహనానికి గురవుతున్నారు? రాహుల్ గాంధీ ఎలాగూ తన తప్పుల నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడరు. అందరూ తనలాగే ఉండాలని, ఆలోచించాలని రాహుల్ అనుకుంటున్నారని పేర్కొన్నారు.