పది ఫీట్లు.. వంద పాట్లు..!
- *ఫుట్ పాత్ స్థలాలను సైతం ఆక్రమిస్తూ పది ఫీట్లకు పైగా ముందుకు
- *దుకాణ సామాగ్రి, వాహనాల పార్కింగ్
- *ప్రభుత్వ కార్యాలయాల ముందు కబ్జా చేస్తూ నేతల అద్దె వసూళ్లు
- *సిగ్నల్స్ ఏర్పాటు చేసినా కంట్రోల్ కానీ ట్రాఫిక్ సమస్య
- *పట్టించుకోని మున్సిపల్, ట్రాఫిక్, పోలీస్ యంత్రాంగం.
- *చలాన్లు వసూళ్ళకే పరిమితమైన వైనం
నాగర్ కర్నూల్ ఆగస్టు 5 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా మారిన నాటి నుంచి క్రమంగా వాహనాల రద్దీ పెరుగుతూ ప్రధాన రహదారుల వెంట ట్రాఫిక్ సమస్య రోజురోజుకు రెట్టింపు అవుతుంది. నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ వంటి మున్సిపాలిటీలతోపాటు ఆయా మండల కేంద్రాల్లోనూ ట్రాఫిక్ సమస్య వాహనదారులను తీవ్రంగా వేధిస్తోంది. ఓవైపు గతుకుల రోడ్లతోపాటు మరోవైపు ట్రాఫిక్ సమస్య పెరగడంతో వాహనదారులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోలేకపోతున్నారు.
ముఖ్యంగా మున్సిపల్ కేంద్రాల్లో ఆయా దుకాణాదారులు సుమారు 10 ఫీట్ల మేర దుకాణాల కంటే ముందుకు సామాగ్రి పేర్చడంతోపాటు వారి వాహనాలను దుకాణాల ముందే నిలపడంతో ప్రధాన రహదారుల వైశాల్యం పూర్తిగా తగ్గుతూ ట్రాఫిక్ సమస్య భారీగా పెరుగుతుంది. దీంతోపాటు ఫోర్ వీలర్ కార్లు, ఆటోలు రోడ్లపైనే నిలపడంతో దూరప్రాంతాల నుంచి వచ్చి పోయే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మున్సిపాలిటీ కేంద్రాల్లో ఫుట్పాత్ ప్రాంతాలను కూడా కబ్జా చేస్తూ కొంత మంది రాజకీయ బడా నేతలు ఆ ప్రాంతాలను ఇతరులకు అద్దెకిస్తూ కొత్త దందా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టింపు లేక రెట్టింపు..!
ఆయా మున్సిపాలిటీలు మండల కేంద్రాల్లోని పోలీస్ ట్రాఫిక్ పోలీస్ మున్సిపల్ అధికారులు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఫుట్పాత్ ఆక్రమణలు భారీగా పెరుగుతున్నాయి. మరోపక్క ఆయా రాజకీయ వ్యాపార సముదాయాల ఫ్లెక్సీలు బ్యానర్లు ప్రధాన రహదారులకు అనుకొని ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య కారణం అవుతోందని విమర్శలు ఉన్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం గతంలో పోలీస్ అధికారులు దాతల సహాయంతో సిసి కెమెరాలతో పాటు స్పీకర్ బాక్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ నేరుగా పోలీస్ స్టేషన్ నుండి పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా శిథిలం కావడంతో పర్యవేక్షణ పట్టింపు లేకపోవడంతో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది.
ఆ తర్వాత ఎన్నోసార్లు దాతల నుంచి నిధులు సేకరించినప్పటికీ పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు తీసుకోకపోవడం షరా మామూలుగా మారిందని వ్యాపారులు మండిపడుతున్నారు.
ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ రోడ్డుకిరువైపులా దుకాణ సముదాయాల ముందు కబ్జా వ్యవహారంలో చర్యలు తీసుకోకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమైందని వాహనదారులు మండిపడుతున్నారు. దాని ఫలితంగా రోడ్డు ప్రమాదాలు కూడా తరచూ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చలాన్ల విధింపుకే ట్రాఫిక్ పోలీస్..
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఆయా దుకాణాల ముందు ద్విచక్ర వాహనాలు ఆటోలు ఫోర్ వీలర్ కార్లు పార్కింగ్ చేయడం పై ట్రాఫిక్ పోలీస్ నిఘా ఉంచుతూ తరచూ ఫోటోలు తీస్తూ చలాన్లు విధిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసుకున్న దుకాణా దారులు వారికి సప్లై చేసే సామాగ్రి రోడ్ ట్రాన్స్పోర్ట్ లారీలు సైతం రోడ్డు పక్కనే నిలిపి ఉంచడంతో ఆర్టీసీ బస్సులు ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ నియంత్రణకు సహకరించేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కేవలం చలాన్లు విధిస్తే సరిపోతుందనేల వ్యవహరించడంపై విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందిస్తూ పోలీస్, మున్సిపాలిటీ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.






