6 August, 2026 | 1:24 AM

ఏకైక ఎమర్జెన్సీ నంబర్ 112

06-08-2026 12:14 AM
  1. ఏకకాలంలో 960 కాల్స్ స్వీకరించే సామర్థ్యం
  2. ఆటోమేటిక్ లొకేషన్ ట్రాకింగ్
  3. ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

రంగారెడ్డి, ఆగస్టు 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో అత్యవసర సేవల వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై వేర్వేరు అత్యవసర సహాయం కోసం వేర్వేరు నంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, దేశమంతటా అమలువుతున్న ఏకైక ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్  112 సేవలను రాష్ట్రంలో అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. 18 రకాల అత్యవసర సేవలు డయల్ 112 ద్వారా అందనున్నాయి.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ ) వేదికగా ఈ సేవలను డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం ప్రారంభించారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా పోలీస్, అంబులెన్స్ (108), అగ్నిమాపక (101) సేవలతో పాటు మహిళల భద్రత, సైబర్ నేరాలు, విపత్తు నిర్వహణ వంటి మొత్తం 18 రకాల అత్యవసర సేవలను 112 నంబర్ పరిధిలోకి తీసుకొచ్చారు. 

అత్యవసర సమయాల్లో కాల్స్ వెయిటింగ్ పడకుండా ఉండేందుకు కొత్త సాంకేతికతతో ఏకకాలంలో 960 మంది కాల్ చేసినా స్వీకరించే సామర్థ్యాన్ని ఈ వ్యవస్థకు కల్పించారు. ఈ సేవల కోసం రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ లేదా 112 డయల్ చేసినప్పుడు, బాధితులు ఉన్న కచ్చితమైన లొకేషన్ కంట్రోల్ రూంకు చేరుతుంది. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి రెస్పాన్స్ టీంలు చేరుకుంటాయి. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘ఆపదలో ఉన్న ప్రతి పౌరుడికి వేగంగా సాయం అందించడమే ఈ డయల్ 112 లక్ష్యం’ అని అన్నారు.