హమ్ ఏక్ హై!
- గల్లీలో బీజేపీ నేతల లడాయి..ఢిల్లీలో దోస్తీ
- విభేదాలు, ఇగోలు పక్కనపెట్టి వరుసగా కేంద్రమంత్రులతో భేటీలు
- రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా క్యూ
- రోడ్లు, రైల్వేలు, జాతీయ ప్రాజెక్టులు, నిధుల విడుదల పేరుతో వినతిపత్రాలు
- హైకమాండ్‌కు తామంతా ఒక్కటే.. సంకేతాలిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): బీజేపీ తెలంగాణ నేతల మధ్య ఆధిపత్య పోరు, విభేదాలు అన్నీ సమసిపోయాయి. అవును చెప్తున్నది నిజమే. వారంతా కలిసిపోయారు. ఇగోలు, వ్యక్తిగత ఇమేజ్‌లు పక్కనపెట్టేసి ‘హమ్ ఏక్ హై..మేమంతా ఒక్కటే...పార్టీయే ఫస్ట్..ఆతర్వాతే సెల్ఫ్’ అని గట్టిగా చెప్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకూ కౌంటర్ ఇచ్చేలా..ఢిల్లీ వేదికగా ఈ సీనంతా కొన్ని రోజుల నుంచి జరుగుతోంది. పార్టీ వర్గాల్లో ఇప్పుడు దీనిగురించే పెద్ద చర్చ. తమ నాయకుల్లో ఇంత మార్పు వచ్చిందేందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక్కడ ఏ ఇద్దరికీ పడని నేతలు ఢిల్లీలో మాత్రం కలిసిమెలిసి కేంద్రమంత్రులను కలుస్తున్నారు.
ఏ కేంద్రమంత్రి దగ్గర వెళ్లినా నేతలంతా కలిసే వెళ్తున్నారు. వెళ్లడమే కాకుండా రాష్ట్రంలోని, తమ నియోజకవర్గంలోని సమస్యలపైన వినతిపత్రాలు ఇస్తున్నారు. గత నెల 20వ తేదీ నుంచే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఒకరిపై ఒకరు పరోక్షంగా, సోషల్ మీడియా వేదికగా విమర్శలు, గ్రూపు రాజకీయాలు చేసుకునే నాయకులు.., ఢిల్లీ వెళ్లగానే మాత్రం అందరం ఒక్కటే అన్నట్లు కలిసి మెలిసి తిరుగుతున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ బీజేపీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ ఢిల్లీలో మాత్రం ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొన్ని రోజుల నుంచి ఐక్యంగా కనిపిం చడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో ఒక్కో నాయకుడిది ఒక్కో పంథా...ఎవరి ఎజెండా...ఎవరి నియోజకవర్గం వారిదే... ఎవరి దారి వారిదే అన్నట్లుగా రాజకీయాలు చేసేవారు. ఢిల్లీలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా అందరూ కలిసి వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.
వీరిలో అకస్మాత్తుగా ఇంత మార్పు వచ్చిందా? లేక దీనివెనుకాల ఏమైన రాజకీయ వ్యూహమేమైనా ఉందా? అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. గల్లీలో ఎలాగున్నా పర్వాలేదు కానీ,.. ఢిల్లీ హైకమాండ్ దృష్టిలో తామంతా ఒక్కటేననే సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా కేంద్రమంత్రుల వద్ద వీరు క్యూ కడుతున్నారా? అని అంతా అనుకుంటున్నారు.
ఢిల్లీలో మాత్రం ఫుల్ యూనిటీ..
జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయిలో పదవుల కోసం, గ్రామ, మున్సిపల్ ఎన్నికల టికెట్ల కోసం నేతల మధ్య పోరు నడిచింది. ఒకరి మీటింగ్‌కు మరొకరు వెళ్లే పరిస్థితి లేదు. ఒకరి కార్యక్రమాన్ని మరొకరు కౌంటర్ చేసిన దాఖలాలూ ఉన్నాయి. కానీ కొన్ని రోజులుగా తెలంగాణ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పడుతున్నారు. ఢిల్లీలో మాత్రం ఒకే గ్రూప్‌గా, ఒకే బృందంగా కేంద్ర మంత్రుల ఆఫీసుల చుట్టూ క్యూ కడుతున్నారు. రోడ్లు, రైల్వేలు, జాతీయ ప్రాజెక్టులు, నియోజకవర్గ సమస్యలు, నిధుల విడుదల పేరుతో వినతి పత్రాలు ఇస్తున్నారు..కలిసి ఫొటోలు దిగుతున్నారు. చూసే కార్యకర్తలకు కూడా ఇది ముచ్చటగానే అనిపిస్తోంది. అయితే ఇలా ఎప్పటికీ కలిసి మెలిసి రాష్ట్రంలోని సమస్యలపై పోరాడితే బాగుంటుందని వారంతా ఆశిస్తున్నారు.
హైకమాండ్‌కు సిగ్నల్ ఇచ్చేందుకేనా?
తెలంగాణ బీజేపీ నేతల్లో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని, నేతల మధ్య సఖ్యత లేదని ఢిల్లీకి రిపోర్టులు ఎప్పటికప్పుడు వెళ్తున్నాయి. అసలే జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరికి వారు ఇలా ఎడమొహం...పెడమొహం అన్నట్లుగా ఉంటే పార్టీకే నష్టమని భావించిన అధిష్ఠానం వీరి మధ్య సఖ్యత పెంచే పనిని చేపట్టింది.
ఇందులో భాగంగానే పార్టీ అంతర్గత సమావే శాల్లో, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీటింగ్‌లు పెట్టి, గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నాన్ని ఇటీవల ఢిల్లీ నేతలు చేపట్టారు. ఇంకా జరుగు తున్నాయి కూడా. ఇదే క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు ముందు, ఇప్పుడు నేతలంతా ఢిల్లీలోనే ఉంటూ ఒక బృందంగా ఏర్పడి జాతీయ నాయకులను కలుస్తూ హైకమాండ్‌కు గుడ్ సిగ్నల్ పంపే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకూ కౌంటర్ ఇచ్చేలా..
లోక్‌సభలో 8, అసెంబ్లీలో 8 సీట్లు గెలిచిన తర్వాత తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు, ప్రాజెక్టులు తీసుకు రావాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉంది. ఒంటరిగా వెళ్తే పని జరగదు. అందుకే బృందంగా వెళ్తే వెయి టేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే పలు అంశాలు, సమస్యలపై వినతి పత్రాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. తామంతా కేంద్ర నిధుల కోసం కలిసి పనిచేస్తున్నాం, తమ వల్లనే రాష్ట్రా నికి నిధులు, ప్రాజెక్టులు,
అనుమతులు వచ్చాయని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు గట్టి కౌంటరూ దీంతో ఇవ్వొచ్చు. అంటే అటు హైక మాండ్, నియోజకవర్గ ప్రజలదృష్టిలో మంచిగా, ఇటు రాష్ట్రంలోని ఇతర పార్టీలను విమర్శించే అవకాశమూ ఉంటుందని ఇలా చేస్తున్నా రేమో అని కూడా చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి ఐక్యత ఉండటం మంచిదే కానీ అది కేవలం ఢిల్లీకే పరిమితమైతే లాభం ఉండదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.






