శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం పాఠశాలను సందర్శించిన మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్
* విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై పరిశీలన
* విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని బ్రహ్మగిరిలోని ప్రభుత్వ ప్రాజెక్టు ఉన్నత పాఠశాలను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డా. జస్టిస్ శమీమ్ అక్తర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో సాధించిన ఫలితాలు, విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
గత విద్యా సంవత్సరంలో పాఠశాల సాధించిన ఉత్తమ ఫలితాలను అభినందించి.. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత, నిర్వహణను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా డా. జస్టిస్ శమీమ్ అక్తర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల నమోదు పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
విద్యార్థుల హక్కుల పరిరక్షణ, సురక్షితమైన పాఠశాల వాతావరణం, సమాన అవకాశాల కల్పన ప్రతి విద్యాసంస్థ బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి, తహసిల్దార్ వెంకటేశ్వర రెడ్డి, అమ్రాబాద్ సీఐ, అమ్రాబాద్ ఎంఈవో బాలకిషన్, పదర ఎంఈవో రామ్‌రెడ్డి, అచ్చంపేట ఎంఈవో శ్రీనివాసమూర్తి, ఎస్సై జయన్న, గ్రామ సర్పంచ్ యు. మల్లేష్, ఉపసర్పంచ్ మొయిజొద్దీన్, రెవెన్యూ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. శంకర్, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






