పీజీ ఈసెట్‌లో 92% అర్హత
- మహిళలు 94.31 శాతం, పురుషులు 91.02 శాతం అర్హత
- ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ ఈ సెట్- 2026 పరీక్షల్లో 92.66 శాతం మంది అర్హత సాధించారు. త్వరలోనే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం జేఎన్టీయూ కూకట్‌పల్లి క్యాంపస్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి పీజీ ఈసెట్- 2026 ఫలితాలను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ టి. కిషన్‌కుమార్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, ఎస్ కె మహమూద్, జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి, పీజీ ఈసెట్- 2026 కన్వీనర్ ప్రొఫెసర్ కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మే 29న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 1తో ముగిశాయి. నాలుగోరోజు ఫలితాలు విడుదల చేశారు. ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించారు.
19 పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 26,077 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 23,637 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 21,958 మంది (92.66శాతం) మంది అర్హత సాధించారు. మహిళలు 14,722 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 13,468 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 12,702 మంది (94.31 శాతం) అర్హత సాధించారు. పురుషులు 11,355 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 10,169 మంది పరీక్షకు హాజరయ్యారు.
అందులో 9256 మంది (91.02శాతం) అర్హత సాధించారు. జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో 136 ఇంజనీరింగ్ కాలేజీలు, 72 ఫార్మసీ కాలేజీలు 2026--27 విద్యా సంవత్సరం అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయని వీసీ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి తెలిపారు. వాటిలో ఇప్పటికే తనిఖీల ప్రక్రియను ముగించామని, కాలేజీల్లో ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి జూన్ 6 వరకు అవకాశం కల్పించినట్టు తెలిపారు.
ఆయా కాలేజీల్లో ఉన్న లోపాలను సరిచేసుకుంటే ఆయా కాలేజీలకు 2026-27 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపును ఇవ్వనున్నట్టు వీసీ స్పష్టం చేశారు. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ముగిసిన వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జారీ చేయనున్నట్టు తెలిపారు.






