6 June, 2026 | 3:04 AM

నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు

06-06-2026 01:39 AM
  • మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఇద్దరి అరెస్టు 
  • 30కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

మందమర్రి, (బెల్లంపల్లి), జూన్ 5 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాల విక్రయదారులపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉమ్మడిగా మెరుపు దాడి చేసి ముఠా గుట్టురట్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 30 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. మందమర్రి పరిధిలోని రామ న్ కాలనీ బ్రిడ్జ్ సమీపంలో నకిలీ విత్తనాల రవాణా జరుగుతోందనే నమ్మదగిన సమాచారంతో శుక్రవారం పోలీసులు, వ్యవసాయ అధికారి కలిసి సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు.

అనుమానాస్పదంగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి రశీదులు, పర్మిట్లు లేని సుమారు 30 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. కారులో ఉన్న శ్రీపతి నగర్‌కు చెందిన మహ మ్మద్ సాహెబ్ జానీ, మహమ్మద్ అఫ్రోజ్‌ను పట్టుకున్నారు. నిందితులు సులభంగా ఎక్కువ డబ్బు సం పాదించాలనే దురాశతో బైంసాకు చెందిన అబ్దుల్ రజాక్ వద్ద కిలో రూ.వెయ్యి చొప్పున ఈ నకిలీ పత్తి విత్తనాలను కొని మందమర్రికి తీసుకువచ్చి, ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులకు ఒక్కో కిలో రూ.2500 చొప్పున విక్రయించాలని ప్లాన్ చేశారు.