13 March, 2026 | 11:08 PM

ప్రజాప్రతినిధులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

13-03-2026 12:41 AM

రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, మార్చి 12 (విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పం చాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కంది ఎల్.ఎన్. కన్వెన్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య నేతృత్వంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్లు, గ్రామ సర్పంచు లు, కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన ప్రజాపాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమ అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ప్రజాప్రతినిధికి తన గ్రామం, పట్టణం అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉంటుందని, అందుకోసం పంచాయతీరాజ్, మున్సిపల్, అటవీ శాఖ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్ర జాపాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల యా క్షన్ ప్లాన్ను ఐదు దశలు, పది అంశాలుగా రూపొందించిందని తెలిపారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించే ప్రజాపాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని మంత్రి దామోదర్ పిలుపునిచ్చారు.

వచ్చే నెల ఏప్రిల్ 2 నుంచి గ్రామాల్లో గ్రామసభలు, పట్టణాల్లో వార్డు సభ లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా గ్రామసభలకు హాజరై ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని సూచించారు. మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధు ల్లో మహిళలే అధికంగా ఉన్నారని తెలిపారు.

మహిళా శక్తి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే నిధులు ఎలా సమకూ ర్చుకోవాలి, గ్రామాల్లో రెవెన్యూ, అటవీ భూ ములను రక్షించుకోవడం, పంచాయతీరాజ్ చట్టాలను సర్పంచులు తెలుసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. నేర్చుకుంటూ ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి తగిన ప్రణాళికలు రూపొందిస్తే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో ముందంజలో ఉంటాయని తెలిపారు.

టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ నిమ్జ్ పారిశ్రామిక ప్రాంతం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూ చించారు. 

కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయిమ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్లు, గ్రామ సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.