విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిళ్లు... గాలిలో దీపంలా లేబర్ బతుకులు
- ఖానాపూర్, కడంలో తరచు విద్యుత్ ప్రమాద సంఘటనలు
- తాజాగా ఆదివారం ఒకరు మృతి
- అడిగే నాధుడు లేక కుటుంబాలు రోడ్డుకు
ఖానాపూర్ (విజయక్రాంతి )విద్యుత్ శాఖలో ప్రైవేటు కాంట్రాక్టర్ల ఒత్తిడికి పొట్ట చేత పట్టుకుని పని కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన లేబర్ ల ప్రాణాలు గాల్లో దీపంగా మారాయి. కాంట్రాక్టర్ ధన దాహం, అధికారుల ఒత్తిడితో లేబర్ లపై పని భారం పెంచి ఎండ ,వాన చూడకుండా పని చేయించడం తో వారు మృత్యువాత పడడానికి కారణం అవుతున్నారు. దీనికి నిదర్శనంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లో గడిచిన మూడు రోజుల్లో విద్యుత్ షాక్కు గురై, విద్యుత్ లైన్ల సవరణ పనుల్లో లేబర్ దుర్మరణం పాలవుతున్న ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు.
తాజాగా ఖానాపూర్ మండలం కొత్తపేట బావా పూర్ లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు పనుల్లో ప్రకాష్( 30 )అనే వ్యక్తి విద్యుత్ స్తంభంపై నుంచి కింద పడి దుర్మరణం పాలయ్యారు. ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉండడం,తండ్రి మరణంతో వారంతా ప్రస్తుతం దిక్కులేనివారైనారు .వీరిని ఆదుకునేందుకు ఆ శాఖ గాని కాంట్రాక్టర్ గాని ముందుకు రాకపోవడం దారుణం.గుట్టు చప్పుడవకుండా శవాన్ని వారి స్వస్థలం మహారాష్ట్రకు తరలించడం స్థానికంగా వివాదాస్పద మైంది ఇటీవల నాలుగు రోజుల క్రితం ఖానాపూర్, కడం ప్రాంతంలో తీవ్ర గాలి, దుమారం, వర్షం, పడటంతో విద్యుత్తు లైన్లు స్తంభాలు విరిగిపోయాయి .
వీటి స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ నుంచి కాంట్రాక్టు అందుకున్న సదరు కాంట్రాక్టర్ ఆంధ్ర ,మహారాష్ట్ర నుంచి లేబర్ లను తీసుకొచ్చి పనులు చేపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కడం మండలం చిన్న క్యాంపు లో పనిచేస్తుండగా ఇమ్మానుయేల్, ఏసురత్నం అనే వ్యక్తులు విద్యుత్ షాక్కు గురై చికిత్స పొందుతున్నారు .
అదే క్రమంలో ఆదివారం ఖానాపూర్ మండలంలో బావా పూర్, కొత్తపేట గ్రామ విద్యుత్ లైన్ పనులు నడుస్తుండగా మిట్ట మధ్యాహ్నం లేబర్ ప్రకాష్ ను స్తంభం పైకి ఎక్కించడం తో ఆ వ్యక్తి కళ్ళు తిరిగి కిందపడిపోయాడని గ్రామస్తులు ఉంటున్నారు. హుటాహుటిన ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.స్థానిక ఎస్త్స్ర రాహుల్ గైక్వాడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






