ఆ మహిళలకు పాపం ప్రతాప్ అంకితం
తిరువీర్ హీరోగా నటించిన తాజాచిత్రం ‘పాపం ప్రతాప్’. ఎస్‌పీ దుర్గ నరేశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఏప్రిల్ 17న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా థాంక్యూ మీట్ నిర్వహించారు మేకర్స్.
ఈ కార్యక్రమంలో కథానాయకుడు తిరువీర్ మాట్లాడుతూ.. “సినిమాకు చాలా బాగా ప్రమోషన్స్ జరిగాయి. రిలీజ్ ముందు ఎక్కడ ‘పాపం ప్రతాప్’ అవుతానేమో అనే భయం ఉండేది, కానీ ప్రేక్షకులు ‘వీర ప్రతాప్’ చేశారు. చాలా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా మహిళలు చాలా కనెక్ట్ అవుతున్నారు. ప్రతి మగాడి విజయానికి అండగా నిలిచే ప్రతి మహిళకు ఈ ‘పాపం ప్రతాప్’ అంకితం. మీ భర్తలకు మీరిచ్చే బెస్ట్ రిటర్న్ ఈ సినిమా” అన్నారు.
పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. “ఈ సినిమా విజయం నాకు సంతృప్తినిచ్చింది. నా పెర్ఫార్మెన్స్‌కు మంచి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. ‘బుజ్జమ్మ’ పాత్ర నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని చెప్పారు. ‘చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఇంకా ఎక్కువ మందికి చేరాలి’ అని డైరెక్టర్ దుర్గ నరేశ్ అన్నారు. నిర్మాత రాకేశ్ మాట్లాడుతూ.. “ప్రతి షోకు ప్రేక్షకులు పెరుగుతున్నారు.
టికెట్ ధర రూ.99 మాత్రమే కాబట్టి ప్రేక్షకులు ఖచ్చితంగా సంతృప్తి పొందుతారు” అన్నారు. నటి రాశి మాట్లాడుతూ.. “నేను ఈ సినిమాను మా అమ్మాయితో కలిసి చూశా. చాలా ఏళ్ల తర్వాత ఒక విజయవంతమైన సినిమాలో నేనున్నాననే ఆనందం కలిగింది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నితిన్ చక్రవర్తి, యువకాంత్ కూడా మాట్లాడారు.






