ఆదర్శ నగరంగా కరీంనగర్
- మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేలా మా పాలకవర్గం పని చేస్తుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. "ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక" రెండో రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం నగరపాలక సంస్థ పరిదిలోని 3,4,5,6,7 డివిజన్లలో మేయర్ కొలగాని శ్రీనివాస్, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యటించారు. 99 రోజుల ప్రణాళిక కార్యక్రమ నేపథ్యంలో మొదటగా 3 వ డివిజన్ విద్యారణ్య పురిలో కార్పోరేటర్ సాదవేణీ లావణ్యతో కలిసి డివిజన్ లో పారిశుధ్య పనులు నిర్వహించారు.
అనంతరం 5 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. డివిజన్ లో పలు కాలనీల్లో పాదయాత్ర చేపట్టి డైనేజీ సమస్యలను పరిశీలించి... వాటిని పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు. అనంతరం 4 వ డివిజన్ దుర్షేడ్ ప్రాంతంలో కార్పోరేటర్ భూపతి రవీంధర్,తో కలిసి పారిశుధ్య పనులు చేపట్టి, 5 లక్షల నిధులతో డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేశారు. స్థానిక దుర్షేడ్ ప్రభుత్వ పాఠశాలలో వసతి సౌకర్యాల ఏర్పాటు పనులకు 10 లక్షల రూపాయల నిధులను కేటాయించారు.
మరో వైపు 5 డివిజన్ లో కార్పోరేటర్ గాదె రూప తో కలిసి 5 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమీ పూజ చేశారు. అనంతరం 6 వ డివిజన్ గుంటూరు పల్లిలో మరో 5 లక్షల నిధులతో డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి... డివిజన్ పారిశుధ్య పనులను ప్రారంభించారు. అనంతరం 7వ డివిజన్ సదాశివ్ పల్లిలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కార్పోరేటర్ ఆకుల నందిని ఉదయ్ తో కలిసి 9 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేశారు.
ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నిధులతో 66 డివిజన్ల ప్రజల సమస్యలను దశల వారిగా పరిష్కరించి కరీంనగర్ నగరపాలక సంస్థ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రం మొదటి పది రోజుల్లో డివిజన్ల లో ప్రధాన సమస్యలైన పారిశుధ్యం, వీది దీపాలు, మంచి నీటి సరఫరా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ... ప్రజా సమస్యలను పరిష్కరించమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. 99 రోజుల కార్యక్రమంలో డివిజన్ల లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ దిలీప్ కుమార్, ఎస్ఈ రాజ్ కుమార్, పారిశుధ్య అధికారులు సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు కార్మీకులు పాల్గొన్నారు.




