రేవంత్ రెడ్డి గారూ.. ఇది వింటున్నారా..?
హైదరాబాద్: హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా తెలంగాణలో రూ.9,377 కోట్లతో చేపట్టనున్న వర్చువల్ గా పలు అభివృద్ధి పనులకు గచ్చిబౌలిలోని హెచ్ఐసీ సెంటర్ నుంచి ప్రధాని మోదీ ప్రారంభోత్సం, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని, అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయని పేర్కొన్నారు. సైబరాబాద్ అతి పెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని, సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. వరంగల్ పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్కును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, దేశ టెక్స్ టైల్ రంగంలో వరంగల్ పీఎం పీఎం మిత్ర పార్కు కీలక పాత్ర పోషించనుందన్నారు. వరంగల్ పీఎం పీఎం మిత్ర పార్కుతో భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయని మోదీ పేర్కొన్నారు.
హైవేలపై కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, హైవేల అభివృద్ధి ద్వారా తెలంగాణ కూడా లాభపడుతోందన్నారు. గతంలో ఉమ్మడి ఏపీకి రైల్వే బడ్జెట్ లో 1000 కోట్లు కూడా దక్కేవి కావు అని, ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.ఐదున్నర వేల కోట్లు కేటాయించామని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. ఇది వింటున్నారా..? అని అడిగారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోందని, తెలంగాణ వికసిస్తే దేశం కూడా వికసిస్తుంది అని మోదీ వ్యాఖ్యానించారు.






