ఆదివాసీ యువకుడి మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 22(విజయక్రాంతి):సిర్పూర్ (టి) మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ కొలవార్ కుల యువకుడు టెకం పెంటయ్య (22) మృతికి బాధ్యులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా ఎస్పీ నితికా పంత్కు వినతిపత్రం అందజేశారు..ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు, తుడుందెబ్బ జాతీయ పొలిట్బ్యూరో చైర్మన్ బుర్స పోశయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పలు డిమాండ్లు చేశారు.
ఈ సందర్భంగా బుర్స పోశయ్య మాట్లాడుతూ హీరాపూర్ గ్రామానికి చెందిన తొమ్మిది ఆదివాసీ కొలవార్ కుటుంబాలు గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై వివాదం నెలకొన్నట్లు తెలిపారు. నకిలీ పట్టాల ఆధారంగా భూములపై హక్కులు చూపుతూ ఆ కుటుంబాలను కోర్టు కేసులతో మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ భూ వివాదానికి సంబంధించి పోలీస్ స్టేషన్కు పిలిపించిన అనంతరం మనస్తాపానికి గురైన టెకం పెంటయ్య ఈ నెల 15న ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు, ఆదివాసీ కొలవార్ కుటుంబాలు సాగు చేస్తున్న భూములకు పూర్తి హక్కులు కల్పించి న్యాయం చేయాలని వారు కలెక్టర్, ఎస్పీని కోరారు.ఈ కార్యక్రమంలో చింతకుంట సర్పంచ్ అజ్మేర చత్రునాయక్, ఉపసర్పంచ్ గాజిరెడ్డి మోహన్, ఆదివాసీ కొలవార్ సిర్పూర్ (టి) మండల అధ్యక్షుడు గంట గోపాల్, సింగిల్ విండో డైరెక్టర్ అజ్మేర మహేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బోట్లకుంట శ్రీనివాస్, వార్డు సభ్యులు నరేష్, శేఖర్, అంజన్న, ఉమారాణి, లావణ్య, స్వరూపతో పాటు హీరాపూర్ గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.






