భగ్గుమన్న బీజేపీ
- ప్రధాని నివాసం వద్ద రాహుల్ ధర్నాపై గరంగరం
- గాంధీభవన్ ముట్టడికి బీజేపీ నేతల యత్నం
- అడ్డుకున్న పోలీసులు
- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతోపాటు పలువురు నేతల అరెస్ట్
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసం వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్, ప్రియాంక వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు నేతృత్వంలో చేపట్టిన గాంధీభవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గాంధీభవన్ వైపు బయలుదేరారు. అయితే పోలీసులు మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేసి బీజేపీ శ్రేణులను నిలువరించారు.
ఇదే క్రమంలో బీజేపీ శ్రేణుల గాంధీభవన్ ముట్టడిని నిరసిస్తూ పోటీగా బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకవైపు బీజేపీ శ్రేణులు, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, కర్రలు రువ్వుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతో పాటు పలువురు నాయకులను గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు గాంధీభవన్ వద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించివేశారు.
చర్చకు రమ్మంటే పారిపోతున్నారు : రాంచందర్‌రావు
లోక్ భవన్‌ను ముట్టడించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధం అన్నారు. ప్రతిపక్ష నేతగా పార్లమెంట్‌లో చర్చకు రమ్మంటే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, విదేశీ కుట్రలకు రాహుల్ గాంధీ వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంటు కీలక సమావేశాలు జరుగుతున్న సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాహుల్ గాంధీ, సభను బహిష్కరించి వీధి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. నీట్ పరీక్ష లీకేజీ అంశంపై సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినప్పటికీ, సమాధానం చెప్పలేక చర్చ నుంచి పారిపోయిన రాహుల్ గాంధీ, ప్రధాని నివాసం ముట్టడికి దిగడం ఆయన అపరిపక్వతకు, చట్టసభల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుంటే, తట్టుకోలేక రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌ల ప్రేరణతో విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు . గతంలో రైతు ఉద్యమం ముసుగులో, షాహిన్ బాగ్ ఆందోళనలో ఏ విధంగానైతే దేశవ్యతిరేక శక్తులు హైజాక్ చేశాయో, నేడు సీజేపీ పేరుతో ధర్నా కూడా అదే తరహాలో సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిరసనకు దిగిన వారిలో అసలు నీట్ విద్యార్థులే లేరని, కేవలం యాంటీ సోషల్, అల్ట్రా లెఫ్ట్ మూకలను జమ చేసి ఆందోళనలు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
సదరు నిరసనల్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణతో పాటు చైనా, పాకిస్తాన్‌లకు మద్దతుగా దేశవ్యతిరేక నినాదాలు చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. ఇతర దేశాల నుంచి వస్తున్న కోట్లాది రూపాయల విదేశీ మాయలో పడి రాహుల్ గాంధీ విదేశీ ఏజెంట్లా మారి బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో యువతను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయితే భారతీయ యువత దేశభక్తి కలిగిన వారని, దేశం కోసం ప్రాణాలిస్తారు తప్ప ఇలాంటి కుట్రలకు లొంగరని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న ఈ విధ్వంసకర, ‘తుక్డే తుక్డే’ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుంతుందన్నారు. పోలీసుల అరెస్టులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. . మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ, నగష్, ఇతర నేతలు మండిపడ్డారు. రాంచందర్‌రావు, ఇతర నేతల అరెస్టును వారు ఖండించారు.
రాష్ట్రంలో పాలక పక్షం తీరు దారుణంగా ఉందని, అధికారంలో ఉంటూ పాలకపక్షం ధర్నాలు, నిరసనలతో శాంతిభద్రతలకు ఉల్లంఘిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. చట్టసభలను నిర్వీర్యం చేస్తూ రోడ్లెక్కి ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. తెలంగాణ బీజేపీ గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ సర్కార్ కుటిల రాజకీయాలు చేస్తుందని ఎంపీ డీకే అరుణ ఆగ్రహించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ధర్నాలు, రాస్తారోకోలతో పాలనను పక్కన పెట్టిందని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌వి డ్రామాలని ఎంపీ గోడెం నగేష్ ఆరోపించారు.
చర్చకు రాకుండా రాజకీయం : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీ కేంద్రప్రభుత్వంపై ఆరోపణలు చేయడం చూస్తుంటే ‘గురవింద గింజ’ సామెత గుర్తుకొస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడి అన్నారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనానికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రంపై లోక్ సభలో చర్చకు సిద్ధమని ప్రభుత్వం ముందుకొచ్చినా చర్చకు రాకుండా కాంగ్రెస్ రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు. నీట్ లీకేజీ బాధ్యులను ఇప్పటికే న్యాయస్థానం ముందు నిలబెట్టిన విషయం అందరికీ తెలిసిందేనని, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో కచ్చితంగా దోషులకు శిక్ష పడే విధంగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.






