23 July, 2026 | 1:54 AM

ఆపద సమయంలో దూరమవుతావా?

23-07-2026 01:16 AM
  1. పార్టీని, కార్యకర్తలను మరిచిన వారు చరిత్రహీనులవుతారు 
  2. మాజీ మంత్రి మల్లారెడ్డికి బహిరంగ లేఖ రాసి రక్తం అద్దిన కార్యకర్త 

మేడ్చల్, జూలై 22 (విజయ క్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బి ఆర్ ఎస్ పార్టీకి దూరం కావడం పై ఒక కార్యకర్త ఘాటుగా, ఆవేదనతో బహిరంగ లేఖ రాశారు. రెడ్ పెన్నుతో రాసి దానిపై రక్తం అది సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ లేఖ మేడ్చల్ నియోజకవర్గం లో తీవ్ర చర్చ నియాంశమైంది. అం దులో కార్యకర్త పేరు, ఊరు రాయలేదు.‘బి ఆర్ ఎస్ పార్టీ రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, కెసిఆర్ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర నిర్మాణ చరిత్రలో ఒక అధ్యాయం.

సిద్ధాంతాన్ని, విశ్వాసాన్ని బలహీనపరిచేలా కనిపించే ప్రతి చర్యను ప్రశ్నించడం కార్యకర్తల హక్కు. కార్యకర్తల మనోభావాలు, గౌరవం పట్టించుకోకుండా తన విద్యా సంస్థలో ఉద్యోగులుగా చిన్న చూపు చూస్తూ, డబ్బు అహంకారంతో నియోజకవర్గంలో నాయకత్వాన్ని, పార్టీని బలహీనపరిచావు‘అని పేర్కొన్నాడు.‘పార్టీని, కార్యకర్తలను మరిచిన ఏ నాయకుడైనా చరిత్రహీనుడిగా మిగిలిపోవడం తథ్యం.

తెలంగాణ ఉద్యమంతో నీకు సంబంధం లేదు, ఉద్యమ కష్టాలు నీకు తెలియవు, అయినప్పటికీ పార్టీ నీకు ఎమ్మెల్యే, మంత్రి పదవులుబి కట్టబెట్టింది. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న సమయంలో దూరంగా ఉండడమే గాక ప్రత్యర్థి పార్టీ వేదికల మీద ఆసీనులై రాష్ట్రంలోని బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలందరి మనోభావాలు దెబ్బతీశావు‘అని రాశాడు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆవేదనతో రక్తంతో లేఖ రాస్తున్నాను అని పేర్కొన్నాడు.