23 July, 2026 | 1:22 AM

నాణ్యత ఘోరం.. శుభ్రత దూరం!

23-07-2026 12:26 AM
  1. నాణ్యత ఎక్కడ... పరిశుభ్రత ఏదీ..?
  2. గాఢ నిద్రలో అధికారులు
  3. తూతూ మంత్రంగా తనిఖీలు
  4. విపరీతంగా పెరిగిన రోడ్‌సైడ్ ఫుడ్ సెంటర్లు
  5. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

మెదక్, జులై 22(విజయ క్రాంతి) : ప్రజల ఆరోగ్యంతో హోటళ్లు, రోడ్సైడ్ ఫుడ్ సెంటర్లు చెలగాటం ఆడుతున్నాయి. లాభార్జనే ధ్యేయంగా వ్యాపారాలు నడిపిస్తున్నారు. అరికట్టాల్సిన అధికారులు గాఢ నిద్రపోతున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు రసాయనిక పౌడర్లు సైతం ఆహార పదార్థాల్లో వాడుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. ఫలితంగా క్రమేపీ ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగున్నా వెలిశాయి.

నిబంధనలకు పాతర వేస్తూ వాటిని నిర్వహించి ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తున్నారు. ముఖ్యంగా తినుబండారాల తయారీలో ప్రమాదకరమైన రసాయనిక పౌడర్లు వాడడం వల్ల ఆకర్షణీయంగా కన్పిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రజల ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా సదరు వ్యాపారులు ఆ పౌడర్లను ఆహార పదార్థాల్లో కలుపుతున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.

జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో రంగులు మార్చే రసాయనాలను వాడుతున్నారు. పానీ పూరీ, ఫ్రైడ్రైస్, చాట్, చికెన్ పకోడి వంటి రోడ్సైడ్ ఫుడ్ సెంటర్లు పట్టణాల్లో విపరీతంగా పెరిగాయి. వాటిని తినే వారు ఎక్కువగా ఉండడంతో వాటికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో కనీస జాగ్రత్తలు, శుభ్రత, నాణ్యత వంటివి పాటించకుండా నాసిరకం, నిల్వ, అపరిశుభ్రంగా ఉండే ఆహార పదార్థాలను సైతం విక్రయాలు సాగిస్తున్నారు.

వీటిని నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు కంటికి కన్పించకపోవడంతో ఇటువంటి వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మెదక్ జిల్లా కేంద్రం వ్యాపార కేంద్రంగా ఉంది. ఇక్కడ విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, ఉపాధి, వ్యాపారాలకు అనువుగా ఉంది. చుట్టుపక్కల సుమారు 100 గ్రామాలకు చెందిన ప్రజలు ఇక్కడకు వచ్చి వెళ్తుంటారు.

చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే వారు, విద్యార్థులు పట్టణంలోనే అద్దెకు ఇళ్లను తీసుకుని ఇక్కడ ఉంటున్నారు. ఈ క్రమంలో పట్టణంలో హోటళ్లు, కర్రీ పాయుంట్లు, రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా హోటళ్లు, ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా ఫుడ్ సెంటర్లు, హోటళ్లపై అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరుతున్నారు.

 పాటించని నిబంధనలు... 

బేకరీలు బ్రెడ్, కేక్ ఇతర ఆహార పదార్థాలతయారీలో ఉపయోగించే నీటి నాణ్యత తయారీ ప్రదేశాల పరిశుభ్రత, నిల్వ విధానాలపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నా యి. నాన్ వెజ్ హోటల్లల్లో మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు విక్రయిస్తున్నారా... ఓకే నూనెను పదేపదే ఉపయోగిస్తు న్నారా..ప్రమాదకర కృతిమ రంగులను కలుపుతున్నారా అనే అంశాలపై తనిఖీలు అవస రమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అనుమతులు ఉన్నాయా...లేవా..? 

హోటళ్ళు, ఫస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలు, గప్ చుప్ సెంటర్లు, తదితర ఆహార విక్రయ కేంద్రాలకు ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ తో పాటు ఇతర తప్పని సరి లైసెన్స్ ఉన్నాయా లేదా అనే అంశంపై అధికారులు సమగ్రంగా పరిశిలించాల్సిన అవసరం ఉంది.

మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని పట్టణంలో ఫస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలు మురుగు కాలువలు పైనే నిర్వహిస్తుండడంతో అక్కడి నుంచి వచ్చే దుర్వాసన ఆహార పదార్థాలపై ప్రభావం చూపుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.