నేతల అరెస్టు అప్రజాస్వామికం
- విద్యార్థులపై లాఠీచార్జి తగదు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ హనుమకొండలో ఆందోళన
- రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు
- హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
- కరీంనగర్‌లో దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు
హనుమకొండ, జూలై 22 (విజయక్రాంతి): లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బుధవారం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు.
డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అవమానమని విమర్శించారు. నీట్ పరీక్ష అక్రమాలపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కాంగ్రెస్ నేతలు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వీ శ్రీనివాసరావు, తాజా మాజీ కార్పొరేటర్లు తోట వెంకన్న, రాజు, రవీందర్ యాదవ్, సంపత్ యాదవ్ పాల్గొన్నారు.
కరీంనగర్‌లో ఉద్రిక్తత
కరీంనగర్(విజయక్రాంతి): కరీంనగర్‌లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సూడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివెళ్లడంతో బీజేపీ శ్రేణులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు, బీజే పీ శ్రేణులు అడ్డుకున్నాయి.
ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి జెండా కర్రలు, రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలపై లాఠీచార్జ్ చేశారు. అంబేద్కర్ చౌక్‌లో ఆందోళన చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మనకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ పలువురు నేతలను అరెస్టు చేశారు. జగిత్యాలలో నిర్వహించిన ధర్నాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు.
కామారెడ్డిలో
కామారెడ్డి/నిజాంసాగర్, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ కారంగల్ అశోక్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, పండ్ల రాజు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం 161 జాతీయ రహదారిపై ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పిట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్ రెడ్డి, నిజాంసాగర్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, పిట్లం సర్పంచ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
బీజేపీ కార్యాలయం ముట్టడిస్తాం: జగ్గారెడ్డి
సంగారెడ్డి (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు గాంధీభవన్ వచ్చి ఏం చేస్తారని.. ఒకవేళ గాంధీభవన్ వస్తే తాము బీజే పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన సంగారెడ్డిలో బైక్ ర్యాలీ నిర్వహించి, మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోదీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తే విద్యార్థుల మీద రక్తాలు వచ్చేలా లాఠీచార్జి చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
సూర్యాపేటలో..
సూర్యాపేట(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద గల అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏఐసీసీ పరిశీలకులు షేక్ మస్తాన్ వలీ, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.






