15 June, 2026 | 4:35 AM

ఆవిష్కరణలే భారత్ బలం

15-06-2026 02:12 AM
  1. 12 ఏళ్లలో తిరుగులేని విజయాలు
  2. ప్రపంచంలో మూడో  అతిపెద్ద  స్టార్టప్ దేశంగా ఇండియా
  3. భారత్  మధ్య  బంధం మరింత బలోపేతం   
  4. ప్రపంచ సవాళ్లకు మేం  పరిష్కారాలు వెతుకుతున్నాం
  5. ఫ్రాన్స్ ‘భారత్ ఇన్నోవేట్స్’ వేదికపై ప్రధాని మోదీ
  6. ఆ దేశ అధ్యక్షుడితో కలిసి హాజరు 

ప్యారిస్: ఆవిష్కరణలే భారత్ బలమని, గత 12 ఏళ్లలో బలమైన ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించామని, ఇవి ప్రపంచం మొత్తానికి ఉపయోగపడేలా ఉన్నాయని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలతో పాటు సాంకేతికత, మనుషుల అవసరాలు, సంక్షేమం, జీవన నాణ్యతను మెరుగుపరచడం కూడా ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో ఆదివారం నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రపంచానికి పరిష్కారాలు చూపే కేంద్రంగా భారత్ ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో భారత్ వేగంగా పురోగతి సాధిస్తోందని, అందుకు స్టార్టప్ విప్లవం నిదర్శనమన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇండియాదేనని పేర్కొన్నారు.

యువత సరికొత్త ఆలోచనలతో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశగా కృషి చేస్తోందన్నారు. ఆ ఆవిష్కరణలను ప్రపంచ వేదికపై నిలబెట్టడమే ఇన్నోవేట్స్ కార్యక్రమం లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలు భారత భవిష్యత్తుకు ప్రతీక అని, వారి ఆత్మవిశ్వాసం, సృజనాత్మక శక్తి నవ భారతానికి అద్దం పడుతుందన్నారు. గ్రామీణ జీవితాన్ని కృత్రిమ మేధ ద్వారా మార్చేలా అనేక స్టార్టప్లు పనిచేస్తున్నాయని మోదీ తెలిపారు.  

భారత్‌పై మాక్రాన్ ప్రశంసల జల్లు

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మా క్రాన్ భారత్ ఆవిష్కరణ వ్యవస్థను ప్రశంసించారు ప్రపంచ ఆవిష్కరణల రంగంలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతోందన్నారు. 140 కోట్ల జనాభాతో కూడిన భారత్.. విద్య, పరిశోధన, సాంకేతిక శిక్షణ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. ఏటా 10 లక్షల మందికి పైగా ఇంజినీర్లను తయారుచేస్తూ ప్రపంచ సాంకేతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అంతరిక్ష రంగంలోనూ భారత్ సాధించిన విజయాలు.. ఆ దేశ సామర్థ్యానికి నిదర్శనమన్నారు.

ఫ్రాన్స్‌ల్లో తొలిసారిగా భారత్ వెలుపల ’భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమం నిర్వహించడం గౌరవంగా ఉందని మెక్రాన్ వ్యాఖ్యానించా రు. భారత్ ఆవిష్కరణలు చేస్తోందా లేదా? అన్నది ప్రశ్న కాదు. భారత్‌లో కలిసి ఎవరు ఆవిష్కరణలు చేస్తారు.. అన్నదే అసలు ప్రశ్న అని మాక్రాన్ పేర్కొన్నారు. భారత్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్లు, ఆవిష్కర్తలకు ఆతిథ్యం ఇవ్వడం ఫ్రాన్స్‌కు గర్వకారణమని చెప్పారు.

కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పు వంటి కీలక రంగాల్లో భారత్,-ఫ్రాన్స్ మధ్య  భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర అణుశక్తి రంగంలో, ముఖ్యంగా చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్ల విషయంలో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.

ఉమ్మడి ప్రయోజనాలతో  సత్సంబంధాలు

‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ భారత్, -ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. ఇరు దేశాలు ఉమ్మడి విలువలు, ఉమ్మడి ప్రయోజనాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. భారత్, ఫ్రాన్స్ సంబంధాలు వ్యూహాత్మక ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాదని.. ఉమ్మడి దృక్పథం, విలువలు, ఆవిష్కరణలు, ప్రేరణలపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.

అంతర్జాతీయ సౌర కూటమి, కృత్రిమ మేధ రంగం, భద్రత, సుస్థిరాభివృద్ధి వంటి అంశాల్లో ఇరు దేశాలు కలిసి ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు వెతుకుతున్నాయన్నారు. భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం భద్రత నుంచి స్థిరమైన అభివృద్ధి వరకు విస్తరించిందన్నారు. ప్రస్తుతం ప్రపంచం లోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌దే. ఈ రిఫార్మ్ ఎక్స్ప్రెస్ కొనసాగుతూనే ఉంటుంది. భారత్‌లో కలిసి పనిచేయాలని మోదీ కోరారు.ఇప్పటికే భారత్, -ఫ్రాన్స్ మధ్య ప్రత్యేక భాగస్వామ్యం ఉందని, ఇది మరింత బలపడినట్లు తెలిపారు.