4 July, 2026 | 2:48 AM

ప్రెస్ కాలనీలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

04-07-2026 12:44 AM

-రూ.80 లక్షలతో వరద నీటి కాలువ పనులు ప్రారంభం 

ఎల్బీనగర్, జూలై 3: మన్సురాబాద్ డివిజన్ ప్రెస్ కాలనీ ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహకారంతో శాశ్వత పరిష్కారం లభించిందని ప్రెస్ కాలనీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు జాల కిషన్ అన్నారు.

కేబీఆర్ పార్క్ వెనుక నుంచి ప్రెస్ కాలనీ సుమారు రూ, 80 లక్షలతో నిర్మించనున్న వరద నీటి కాలువ పనులను శుక్రవారం ప్రారంభమయ్యాయి. పనులను కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదగిరి యాదవ్, ప్రధాన కార్యదర్శి సోమ సుభాష్, కాలనీ సభ్యులతో కలిసి జాల కిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ...కొన్ని సంవత్సరాలుగా ప్రెస్ కాలనీ వాసులు వరద నీటి కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వర్షాకాలంలో  ప్రెస్ కాలనీ వాసుల ఇళ్లలోకి వరద నీరు వచ్చేదన్నారు.

భారీ వర్షాలు పడిన సమయంలో లోతట్టు ప్రాంతాల ఇళ్ల వాసులు ఇళ్లలో ఉండే పరిస్థితి ఉండేది కాదని కిషన్ వివరించారు. సహారా, కేబీఆర్ పార్క్ పైన ఉన్న కాలనీల నుంచి వర్షా కాలంలో వరద నీరు ప్రెస్ కాలనీకి భారీగా వచ్చేదని,  అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వరద ఇళ్లను ముంచిన సందర్భాలు ఉన్నాయి అని ఆయన గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు భాస్కర్ యాదవ్, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు నెల్లుట్ల రాధా మనోహర్, ఉగ్రరూపం తానాజీ, తెలంగాణ వెంకన్న, చెన్నయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.