సర్‌కు ప్రజలు సహకరించాలి
- ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు ఎంతో కీలకం
- టీఎన్‌జీవో కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేని
హైదరాబాద్, జూన్ 27(విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రా రంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోస్) శనివారం తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల (టీఎన్‌జీవో) కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేని (ముజీబ్)నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భం గా అధికారులు వారి కుటుంబ సభ్యుల ఓటర్ వివరాలను పరిశీలించి, నిర్దేశిత ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. ఈ ప్రక్రి యపై డాక్టర్ ముజీబ్ స్పందిస్తూ, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు, ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దేందుకు ఈ ‘సర్’ సర్వే ఎంతో కీలకమైనదన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజలంతా పూర్తి స్థాయిలో సహకరించి, ఇంటింటికీ వస్తున్న బీఎల్‌ఓలకు సరైన సమాచారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తం గా సుమారు 36వేల మంది బీఎల్‌వోలతో ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు సాగే ఈ ముమ్మర ఇంటింటి సర్వేలో మొదటి విడతగా కేవలం ఎన్యుమరేషన్ ఫారాలను మాత్రమే అందజేస్తారని, వారం రోజుల తర్వాత అధికారులు తిరిగి వచ్చి పూర్తి చేసిన ఫారాలను సేకరిస్తారని,
ఈ దశలో ఎలాంటి అధికారిక పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సర్వే అనంతరం జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారని, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు తప్పుల సవరణకు, కొత్త ఓట్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అన్ని ఆక్షేపణలను పరిశీలించిన అనంతరం అక్టోబర్ 1, 2026న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా మీడియాకు వెల్ల డించారు.






