ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 29 (విజయక్రాంతి): జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, లోలెవల్ వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాణహిత నదిలో వరద ప్రవాహం పెరుగుతోందని, వట్టివాగు ప్రాజెక్ట్లో ఇన్ఫ్లో అధికంగా ఉండటంతో రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. జలపాతాలు, పర్యాటక ప్రాంతాల వద్దకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని, రీల్స్, ఫొటోల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రులకు తరలించడం, లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 8500844365 నంబర్తో ఏర్పాటు చేసిన జిల్లా కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు.






