01-02-2026 12:00:00 AM
పెన్షన్ అనేది ఒక కార్మికుడు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రతి నెల కుటుంబ పోషణ, వృద్ధాప్యంలో ఒకరిపై ఆధారపడకుండా జీవించడానికి పొందే సొమ్ము. ఉద్యోగ జీవితంలో సమాజానికి, సంస్థకు తోడ్పడిన తర్వాత పదవీ విరమణ చేసిన వ్యక్తులు వృద్ధాప్యంలో గౌరవంగా జీవించడానికి పెన్షన్ వీలు కల్పిస్తుంది.1952లో ఏర్పాటైన ఈపీఎఫ్ సంస్థ పదవీ విరమణ చేసిన కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తుంది. బొగ్గు ఉద్యోగులైన కోల్ ఇండియా, సింగరేణి ఉద్యోగులకు కూడా పెన్షన్ పథకం అమలు పరుస్తున్నాయి.
బొగ్గు ఉద్యోగులకు కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ద్వారా పెన్షన్ చెల్లిస్తున్నారు. దీనిని ట్రస్ట్ ద్వారా నిర్వహిస్త్తున్నారు. కోల్ మైన్స్ పెన్షన్ స్కీం--1998 అనే చట్టం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ప్రతి నెల ఉద్యోగి వేతనం నుంచి 7 శాతం కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యా కోల్ మైన్స్ పెన్షన్ ఫండ్‌కు జమ చేస్తున్నారు.
కోల్ మైన్స్ పెన్షన్ ఫండ్ స్థిరత్వం కోసం బొగ్గు యాజమాన్యాలు ప్రతి టన్ను బొగ్గు అమ్మకంపై 20 రూపాయలు పెన్షన్‌ను ఫండ్‌కు జమ చేసినప్పటికీ బొగ్గు విశ్రాంత ఉద్యోగులకు నేటి ధరలకు అనుగుణంగా పెన్షన్ పెరగడం లేదు. ఇక 2004లో జాతీయ పెన్షన్ స్కీం ఏర్పాటుతో ప్రైవేట్ కంపెనీలు పెన్షన్ నిధుల నిర్వహణను ప్రారంభించడానికి మార్గం సుగమం అయింది.
పదవీ విరమణ తర్వాత జీవనోపాధికి భద్రత కల్పించడానికి బదులుగా కార్మికులపై మార్కెట్ నష్టాల భారాన్ని మోపే విధంగా ప్రైవేట్ ఆర్థిక సంస్థల ప్రయోజనాల కోసం పెన్షన్ వ్యవస్థను నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ , ప్రైవేట్ రంగ సంస్థల్లో పని చేసిన వారు ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం- 95 ద్వారా అందుకుంటున్న పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. గత కొన్నేళ్లుగా రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు కరువు భత్యంతో కూడిన పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాయి.
ఆళవందార్ వేణు మాధవ్, హైదరాబాద్